Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నటుడి నివాసంలో చోరబడిన ఓ యువకుడు ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడని తెలిసిందే. దర్యాప్తు ముమ్మరం చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేశారు.


జనవరి 16 తెల్లవారుజామున 2.30 గంటలకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడు దాదాపు 6 చోట్ల కత్తితో దాడిచేయడంతో.. సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్టు తెలిపారు. దాడి సమయంలో సైఫ్ పక్కనే ఉన్న పని మనిషి పలు ముఖ్యమైన వివరాలను తెలియజేసింది. దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తి రూ.1కోటి డిమాండ్ చేశాడని తెలిపింది.


అసలేం జరిగిందంటే..


ఇలియామా ఫిలిప్ అనే పని మనిషి గత నాలుగేళ్లుగా సైఫ్ అలీఖాన్ ఇంట్లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. సైఫ్ కుటుంబం 11, 12వ అంతస్తులలో నివసిస్తోంది. అక్కడ 3 గదులుండగా.. అందులో ఓ గదిలో సైఫ్, కరీనా ఉంటుండగా.. మరో 2 గదులు వారి కుమారులైన తైమూర్, జెహ్‌నాగీర్ చెందినవి. తైమూర్ ను గీత అనే నర్సు చూసుకుంటోంది. ఇక చిన్న కొడుకును ఫిలిప్ చూసుకుంటోంది. “రాత్రి 2 గంటల ప్రాంతంలో ఏదో శబ్దం రావడంతో నిద్ర నుంచి లేచి చూశాను. బాత్రూం తలుపు తెరిచి, లైట్ వెలగడం చూసి.. కరీనా.. జెహ్ ని కలవడానికి వచ్చి ఉంటుందని భావించి మళ్లీ పడుకున్నాను. కానీ ఏదో జరిగి ఉంటుందని నాకు కాసేపయ్యాక అర్థమైంది. అంతలోనే నేను ఒక నీడను చూశాను అని ఆమె పోలీసులకు చెప్పింది. 


నాపై దాడికి యత్నం. రూ.1 కోటి డిమాండ్


అనుమానం వచ్చిన ఆ వ్యక్తి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి పనిమనిషిని మౌనంగా ఉండమని చెప్పాడు. "అతను నన్ను బెదిరించాడు. దీంతో బయటకు వెళ్ళలేకపోయాను. నేను జెహ్‌ వద్దకు వెళ్తుండగా, అతను నా వైపు పరిగెత్తాడు. ఆ టైంలో అతని చేతిలో హెక్సా బ్లేడ్ ఉంది. అతని ఎడమ చేతిలో చెక్క లాంటి ఓ వస్తువు ఉంది" అని ఆ పని మనిషి చెప్పింది. ఈ గొడవలో ఫిలిప్‌పై హెక్సా బ్లేడ్‌తో దాడి చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె తన దాడిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించడంతో ఆమె తన రెండు చేతుల మణికట్టు దగ్గర, ఎడమ చేతికి బ్లేడ్ వల్ల గాయమైంది అని పోలీసుల ఫైల్ చేసిన రెండు పేజీల ఎఫ్‌ఐఆర్‌ వెల్లడించింది. "ఆ సమయంలో నేను అతనిని మీకు ఏమి కావాలి అని అడిగాను. అతను మనీ అని చెప్పాడు. 'ఒక కోటి' అని ఇంగ్లీషులో సమాధానం చెప్పాడు" అని ఆమె మరిన్ని వివరాలు తెలియజేసింది. అలికిడి విన్న సైఫ్ అక్కడికి రాగానే అతనిపైనా దాడి చేశాడని చెప్పింది. "ఆ తర్వాత సైఫ్ నన్ను విడిపించి, దాడి చేసిన వ్యక్తిని ఓ గదిలో బంధించాడు. అనంతరం అందరం మేడ పై ఉన్న గదికి పరిగెత్తగా.. అంతలోనే ఆ వ్యక్తి ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని పారిపోయాడ"ని వివరించింది.


దాడిపై కరీనా కపూర్ పోస్ట్ 


మరోవైపు సైఫ్ అలీఖాన్ భార్య, నటి కరీనా కపూర్ తన భర్తపై జరిగిన దాడిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఓపికగా ఉండాల్సిన సమయమని, దయచేసి ఈ సంఘటన గురించి ఎవరూ అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి జరిగిన ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని... అంత వరకూ అందరూ సహకరించాలని కోరారు.


Also Read : Saif Ali Khan Attacker: ఇతనే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది - ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు