Prajwal Revanna Case: అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవణ్ణకి ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. జూన్ 6వ తేదీ వరకూ ఆయనను కస్టడీలో ఉంచేందుకు అనుమతి లభించింది. జర్మనీ నుంచి వచ్చిన రేవణ్ణని బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లోనే సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 12.45 గంటలకు ముగ్గురు మహిళా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుుకన్నారు. మహిళా పోలీసులతో ప్రజ్వల్ రేవణ్ణని అరెస్ట్ చేయించడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కర్ణాటక మహిళా పోలీసులు రాష్ట్రంలోని మహిళలందరికీ రక్షణ కల్పిస్తామన్న సంకేతాలిచ్చారంటూ కొందరు పొగడ్తలు కురిపించారు. ప్రజ్వల్‌ని అరెస్ట్ చేసిన వెంటనే మెడికల్ చెకప్‌కి తీసుకెళ్లారు. ఆ తరవాత ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు కస్టడీలో ఉంచేందుకు అనుమతినివ్వాలని పోలీసులు కోర్టుని కోరారు. ఒక్కరోజు కస్టడీలో ఉంచితే చాలంటూ ప్రజ్వల్ తరపున న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది.