Mother Throws Son in River: భర్తతో గొడవపడిన ఓ మహిళ ఆ కోపాన్ని కొడుకుపై చూపించింది. మొసళ్లు ఉండే నదిలో ఆ చిన్నారిని విసిరేసి వెళ్లిపోయింది. కర్ణాటకలో జరిగిందీ ఘటన. దండేలీ తాలూకాలోని ఓ నదిలో ఓ తల్లి తన మాటలు రాని ఆరేళ్ల కొడుకుని నదిలో పారేసినట్టు పోలీసులు వెల్లడించారు. పుట్టుక నుంచి మాటలు రాని పెద్ద కొడుకు గురించి భార్య భార్తల మధ్య చాలా సార్లు గొడవ జరిగినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూగ పిల్లాడిని ఎందుకు కన్నావంటూ భర్త పదేపదే ఆమెని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడని ఆరోపిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ పిల్లాడిని ఎక్కడైనా పారేసేయ్ అంటూ వేధించేవాడని పోలీసులు చెప్పారు. ఈ నెల 4వ తేదీన కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ కోపంలోనే కాళీ నదిలో కలిసే ఓ కాలువలో పెద్ద కొడుకుని విసిరేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడిని బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయితే..అప్పటికే చీకటి పడడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకం కలిగింది. మొత్తానికి తెల్లారి ఉదయం ఎలాగోలా బాలుడిని కనుగొని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. మొసలి దాడిలో ఓ చేయి పోగొట్టుకున్నాడు. శరీరమంతా గాట్లు పడ్డాయి. పోస్ట్‌మార్టం కోసం బాడీని తరలించారు. మృతికి కారణమేంటో త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.