Moscow Hall Terror Attack: రష్యాలోని మాస్కోలో ఉగ్రదాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాన్సర్ట్‌హాల్‌లో మిలిటరీ డ్రెస్‌లో చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటి వరకూ 133 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడితో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లలో నలుగురు ఉగ్రవాదులున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ దాడి జరిగిన కాన్సర్ట్‌హాల్‌లో మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అంతకు ముందు 143 మంది చనిపోయినట్టు చెప్పినా...ఇప్పటి వరకూ 133 డెడ్‌బాడీలు దొరికాయి. 24 గంటల పాటు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ఈ మృతదేహాల్ని బయటకు తీశారు. ఇందులో 28 డెడ్‌బాడీలు టాయిలెట్‌లో దొరికినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడి వెనకాల ఉక్రెయిన్ హస్తం ఉందని ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసింది రష్యా. ఉగ్రవాదులకు ఉక్రెయిన్ సాయం అందించిందని విమర్శించింది. దీనిపై ఉక్రెయిన్ గట్టిగానే స్పందించింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
"ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కి వెళ్లినట్టు మాకు ప్రాథమిక సమాచారం అందింది. సరిహద్దుని దాటేందుకు వాళ్లు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కచ్చితంగా వీళ్ల వెనక ఉక్రెయిన్ ఉండే ఉంటుంది"
- పుతిన్, రష్యా అధ్యక్షుడు
ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా గట్టిగానే బదులిచ్చారు. ఇలా ప్రజల్నితప్పుదోవ పట్టించడం పుతిన్‌కి అలవాటే అంటూ మండి పడ్డారు. ప్రస్తుతానికి తమ దేశ సైన్యం రష్యా సైన్యంపై యుద్ధం చేయడంలోనే పూర్తిగా నిమగ్నమై ఉందని స్పష్టం చేశారు. అటు రష్యా మాత్రం ఈ ఆరోపణల్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఈ దాడి వెనకాల ఎవరు ఉన్నా కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెబుతోంది.
మార్చి 22న రాత్రి కాన్సర్ట్ హాల్‌లో అంతా కిక్కిరిసిపోయి ఉండగా కొందరు ఉగ్రవాదులు రష్యా మిలిటరీ దుస్తుల్లో లోపలికి వచ్చారు. అక్కడి వాళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ధాటికి పైకప్పు కూలిపోయింది. ఈ ధాడిలో అక్కడికక్కడే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెబుతున్నా...ప్రభుత్వం మాత్రం 60 మంది చనిపోయినట్టు అప్పటికి అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.