Bird Flu Cases in US: అమెరికాలో బర్డ్‌ఫ్లూ భయపెడుతోంది. కేసులు వరుసగా పెరుగుతుండడం వల్ల కోళ్లు పెంచుతున్న రైతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది కోళ్లని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని Lowa ప్రాంతంలో కోళ్ల ఫామ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఫ్లూ వ్యాప్తి చెందుతోందన్న భయాందోళనల కారణంగా కోళ్లని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అగ్రరాజ్య చరిత్రలోనే ఈ స్థాయిలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది లేదు. లోవాలోని chicken flock కోళ్ల ద్వారా దాదాపు 40 లక్షల కోళ్లకు ఫ్లూ సోకిందని తేలింది. ఈ మేరకు అధికారులు ఈ ప్రకటన చేశారు. అందుకే...ఈ కోళ్లని చంపేయాలని రైతులు డిసైడ్ అయ్యారు. 2022 తరవాత అత్యధిక కేసులు ఇప్పుడే నమోదవుతున్నాయి.
అమెరికాలో సరఫరా అయ్యే గుడ్లన్నీ ఎక్కువ శాతం లోవా ప్రాంతం నుంచే వస్తాయి. అటు ఆవులకు కూడా ఈ ఫ్లూ సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా కోళ్లను చంపేయాలని రైతులు చూస్తున్నారు. ఇప్పటికే 14 లక్షల కోళ్లను చంపేశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం...2022లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 9.2కోట్ల కోళ్లను చంపేశారు. రెండేళ్లలో కనీసం 50 లక్షల కోళ్లకు ఈ ఫ్లూ సోకిందని గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల పాశ్చురైజ్డ్ పాలలో బర్డ్‌ఫ్లూ అవశేషాలు గుర్తించినట్టు Food and Drug Administration (FDA) చేసిన ప్రకటన సంచలనమైంది. అప్పటి నుంచి అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బీర్‌లోనూ తొలిసారి బర్డ్‌ఫ్లూ అవశేషాలు గుర్తించారు.