Morbi Bridge Tragedy: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 14న విచారించనుంది. 






9 మంది అరెస్ట్


మోబ్రీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ కొనసాగుతోంది. మేనేజర్, సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి సంచలన విషయం వెల్లడించారు. ఈ వంతెనను మరమ్మతు చేయించాక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులు సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఈ వంతెనను ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న కంపెనీపైనా FIR నమోదు చేశారు పోలీసులు.


భారీ ప్రాణ నష్టం


బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.


ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.


ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు.


Also Read: Maharashtra Road Accident: భక్తులపైకి దూసుకెళ్లిన కారు- ఏడుగురు మృతి!