Monkeypox in India: 


మళ్లీ కేరళలోనే మంకీపాక్స్ కేసు..


కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని పరీక్షించగా, మంకీపాక్స్ సోకినట్టు నిర్ధరణ అయింది. ప్రస్తుతానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. మే13 వ తేదీనే దుబాయ్ నుంచి కన్నూర్ వచ్చినా...లక్షణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. బాధితుడితో సన్నిహితంగా ఉన్న వారందరినీ అప్రమత్తం చేసిన అధికారులు వారి ఆరోగ్యంపైనా దృష్టి సారించారు. జులై 14వ తేదీ కేరళలోని కొల్లం జిల్లాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే పరీక్షించగా మంకీపాక్స్‌ సోకినట్టు తేలింది. అటు కోల్‌కతాలోనూ ఈ వైరస్ కలకలం రేపుతోంది. ఓ విద్యార్థిలో ఈ సింప్టమ్స్ ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవలే యూరప్‌కు వెళ్లొచ్చిన యువకుడికి శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా. మంకీపాక్స్‌కు సంబంధించిన ఇతర లక్షణాలూ
ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆరోగ్యశాఖ, ఆ విద్యార్థిని ఐసోలేషన్‌లో ఉంచింది. శాంపిల్ సేకరించి, మంకీపాక్స్‌ అవునో కాదో అని నిర్ధరించేందుకు పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపింది. 


ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..


యూరప్‌లో మంకీపాక్స్‌ కేసులు భారీగా నమోదవుతుండటం, అక్కడి నుంచే ఈ యువకుడు రావటం అధికారులను కలవర పెడుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, ఈ వైరస్ ఇతరులకూ సోకుతుందని భావించి, వెంటనే ఐసోలేషన్‌కు పంపారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదని, వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి రిపోర్ట్ వచ్చిన తరవాతే వైరస్ ఉందా లేదా అన్నది నిర్ధరణ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కోల్‌కతాలోనే ఓ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న యువకుడిని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హెల్త్ కండీషన్‌ని గమనిస్తున్నారు. ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, దద్దులు, లాంటి సింప్టమ్స్‌ ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని చెప్పింది. ఇలాంటి లక్షణాలు వేరే వ్యక్తిలో కనిపించినా వెంటనే ఆరోగ్య సిబ్బందికి చెప్పాలని సూచించింది. పచ్చిమాంసం తినటాన్ని కొద్ది రోజుల పాటు మానుకోవాలని తెలిపింది. ఆఫ్రికాకు చెందిన లోషన్స్, క్రీమ్స్‌ వాడకూడదనిహెచ్చరించింది. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తి పక్కన నిద్రించటం, ఆ వ్యక్తి దుస్తులను ధరించటం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. బతికున్న లేదా, చనిపోయిన జంతువుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని తెలిపింది. భారత్‌లో హాల్‌బార్న్ వెల్స్ ఇండియా అనే సంస్థ పీసీఐర్ కిట్‌ను తయారు చేసింది. ఈ కిట్ సాయంతో మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించొచ్చు. కేవలం 90 నిముషాల్లో ఫలితాలు వెల్లడవుతాయి. 


Also Read: Adani Wilmar Price Cut: వంట నూనె ధరలు భారీగా తగ్గింపు-ఒక్కో లీటర్‌పై ఎంతంటే?