Monkey Fever: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోన్న వేళ మంకీ ఫీవర్ (Monkey Fever) కలవర పెడుతోంది. కేరళ వయనాడ్‌లో ఓ మంకీ ఫీవర్ కేసు నమోదైంది. తిరునెల్లి గ్రామ పంచాయతీ పనవల్లీకి గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల వ్యక్తికి ఈ జ్వరం వచ్చింది.
ఒకటి పోతే ఒకటి
కరోనా థర్డ్ వేవ్‌తో ఇన్నాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిన కేరళను మంకీ ఫీవర్ భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా కేఎఫ్డీగా పిలిచే ఈ సాంక్రమిక జ్వరాన్ని మంకీ ఫీవర్ అని పిలుస్తారు. దక్షిణ భారతంలో ప్రస్తుతం ఈ రోగం ఎండమిక్ దశకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఈ ఏడాదిలో తొలి కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వైద్యుల పర్యవేక్షణలో
బాధితుడ్ని మనంతవాడీ మెడికల్ కళాశాలలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్య అధికారి డా. సకీనా వెల్లించారు. ఇప్పటివరకు మరో కేసు నమోదు కాలేదన్నారు.
లక్షణాలు
మంకీ ఫీవర్ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది.
కర్ణాటకలో..
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ ఏడాది మంకీ ఫీవర్ తొలి కేసు బయటపడింది. గత నెల తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధరణయినట్టు వైద్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం శివమొగ్గ జిల్లా సాగర్ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్‌తో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
ఇక, ఆరు దశాబ్దాల కిందట శివమొగ్గ జిల్లాలోని క్యాసనూర్ గ్రామంలో ఎల్లో ఫీవర్ మాదిరిగా అంతుబట్టని వైరస్ ప్రబలి భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనిపై పరిశోధనలకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ల్యాబొరేటరీలను 1950వ దశకంలో నెలకొల్పింది. ఇందుకోసం భారీగా నిధులను వెచ్చించింది. కొత్త వైరస్ పుట్టుక, మానవులకు ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది తెలుసుకోడానికి సాగర్‌లో ల్యాబ్, ఫీల్డ్ స్టేషన్ ఏర్పాటు చేసింది.
Also Read: Owaisi On Hijab Row: 'నేను టోపీతో పార్లమెంటుకు వెళ్లినప్పుడు- వాళ్లు హిజాబ్‌తో కళాశాలకు ఎందుకు వెళ్లకూడదు?'
Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో- జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య