స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపించారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు కట్టుబడి ఉంటామని చెప్పడం వారిలో ఆత్మవిశ్వాసం పెంచింది. వీటికి తోడు ఐరోపా, ఆసియా మార్కెట్లూ సానుకూలంగానే ఉండటం కలిసొచ్చింది. మదుపర్ల సంపదగా భావించే సెన్సెక్స్‌ 46౦ పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,600 పై స్థాయిల్లో ముగిసింది. 


క్రితం రోజు 58,465 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,810 వద్ద భారీ గ్యాప్‌ అప్‌తో మొదలైంది. 58,332 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకినప్పటికీ వెంటనే పుంజుకుంది. 59,060 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 460 పాయింట్ల లాభంతో 58,926 వద్ద ముగిసింది.


బుధవారం 17,463 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,554 వద్ద లాభాల్లో ఆరంభమైంది. అయితే వెంటనే 17,427 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. ఆర్‌బీఐ పరపతి సమీక్ష తర్వాత కొనుగోళ్లు పుంజుకున్నాయి. దాంతో 17,639 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 142 పాయింట్ల లాభంతో  17,605 వద్ద ముగిసింది.


బ్యాంకు నిఫ్టీ సైతం ఆరంభంలో అప్రమత్తంగా కదలాడింది. ఉదయం 38,801 వద్ద ఆరంభమైంది. 38,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్లతో 39,197 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 400 పాయింట్ల లాభంతో 39,010 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 37 కంపెనీలు లాభాల్లో, 13 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, ఇన్ఫీ, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, లాభపడ్డాయి. మారుతీ, ఐఓసీ, శ్రీసెమ్‌, అల్ట్రాసెమ్‌కో, అదానీ పోర్ట్స్‌ నష్టాల్లో ముగిశాయి. కీలక సూచీలన్నీ గ్రీన్‌లోనే ముగిశాయి. రియాలిటీ, బ్యాంక్‌, పవర్‌, మెటల్‌ సూచీలు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి.