Amit Shah on Modi Retirement: మూడోసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారని, అమిత్ షా ప్రధాని అవుతారని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ కామెంట్స్‌పై అమిత్‌ షా స్పందించారు. 75 ఏళ్లు నిండగానే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేజ్రీవాల్ అనవసరంగా కలలు కంటున్నారని చురకలు అంటించారు. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని..ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష కూటమికి అలాంటి శుభవార్త ఏమీ ఉండకపోవచ్చంటూ సెటైర్లు వేశారు. 


"అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ప్రతిపక్ష కూటమికి ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. 75 ఏళ్లు రాగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిబంధన బీజేపీ రాజ్యాంగంలో లేదు. నరేంద్ర మోదీ రానున్న ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉంటారు. ఆయనే దేశానికి నాయకత్వం వహిస్తారు. ఈ విషయంలో బీజేపీలో ఎలాంటి సందిగ్ధత లేదు"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి






అమిత్ షా ఇంకేమన్నారంటే..


అరవింద్ కేజ్రీవాల్‌పైనా సెటైర్లు వేశారు అమిత్ షా. ఆయనకు కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు. ఈ తాత్కాలిక ఉపశమనం ఆయనను లిక్కర్ స్కామ్‌ నుంచి బయటపడేయలేదనవి తేల్చి చెప్పారు. కేవలం ఎన్నికల ప్రచారం చేసుకోడానికి మాత్రమే కోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. తన అరెస్ట్‌ని అక్రమం అని వాదించే పనిలో ఉన్నారని, కానీ కోర్టు ఆ ఆరోపణలను అంగీకరించలేదని అన్నారు. జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ మళ్లీ ఈడీకి లొంగిపోవాల్సిందేనని వెల్లడించారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని క్లీన్ చిట్‌గా భావిస్తే ఆయనకు చట్టం గురించి పెద్దగా అవగాహన లేదనుకోవాల్సి ఉంటుందని అన్నారు. 


కేజ్రీవాల్ ఏమన్నారు..?


జైల్ నుంచి బయటకు వచ్చిన తరవాత తొలిసారి ఎన్నికల ప్రచారం చేసిన కేజ్రీవాల్ ప్రధాని మోదీ రిటైర్‌మెంట్‌ గురించి ప్రస్తావించారు. బీజేపీ మరోసారి అదికారంలోకి వస్తే మోదీ రిటైర్ అవుతారని, అమిత్ షా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అంతే కాదు. యోగి ఆదిత్యనాథ్‌ పొలిటికల్ కెరీర్‌కి కూడా ఎండ్ కార్డ్ పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి తరహాలోనే యోగి ఆదిత్యనాథ్‌ పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. రెండు నెలల్లో అంతా మారిపోతుందని తేల్చి చెప్పారు. 


Also Read: UP News: హోటల్‌ గదిలో ఇద్దరు వ్యక్తులతో భార్య, తట్టుకోలేక చెప్పుతో చితకబాదిన భర్త