Modi announces full freedom for army : ప్రధాని మోదీ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ దోవల్, CDS అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. సరిహద్దుల్లో భద్రతా చర్యలపై చర్చించారు. హై లెవల్ మీటింగ్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని.. భారత బలగాలపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని.. సైన్యమే ప్లేస్, టైమ్ చూసి జవాబిస్తుందని స్పష్టం చేశారు.
అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత సైనిక ప్రతిస్పందన విధానం, లక్ష్యాలు , సమయాన్ని నిర్ణయించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయుధ దళాలకు 'పూర్తి స్వేచ్ఛ' ఇచ్చినట్లు అయింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడం మన జాతీయ సంకల్పమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత సైన్యంపై తనకు పూర్తి విస్వాసం ఉందని మోదీ తెలిపారు. సమావేశం తర్వాత కొద్దిసేపటికే, హోంమంత్రి అమిత్ షా , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానమంత్రి నివాసానికి వచ్చారు.
గతంలో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించింది. ఈ శిబిరాలను పాకిస్తాన్ సైన్యం సహాయంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ నిర్వహించేది. అప్పటి దాడిలోనూ ఆధారాలు పాకిస్తాన్ వైపే చూపించాయి. ఇప్పుడు కూడా అంతే. ఈ విషయంపై అమెరికా, రష్యా, చైనా, జపాన్ , కొన్ని యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ సమాచారం అందించింది. ఇప్పటికే పాకిస్తాన్‌పై వరుస దౌత్యపరమైన ఆంక్షలను భారత్ విధించింది.
ఇప్పటికే దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని మినహాయించి పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రభుత్వం వైద్య వీసాలను కూడా రద్దు చేసింది. పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని నోటిఫైడ్ వీసాలు ఏప్రిల్ 27 ఆదివారంతో ముగిశాయి, దీనితో సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద పాకిస్తాన్ పౌరులు పెద్ద క్యూ కట్టారు. పాకిస్తాన్‌పై మరిన్ని దౌత్యపరమైన ఆంక్షలలో భాగంగా, పాకిస్తాన్‌కు దాదాపు 85 శాతం సరఫరాను అందించే కీలకమైన జల భాగస్వామ్య ఒప్పందమైన సింధు జల ఒప్పందాన్ని కూడా భారతదేశం నిలిపివేసింది.