India Preparing For Attack: ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చాలా పక్కాగా ప్లాన్ చేస్తోందని అమెరికన్ మీడియా చెబుతోంది. ముఖ్యంగా దాడులపై అంతర్జాతీయంగా ముఖ్యమైన దేశాలకు భారత్ సమాచారం ఇస్తోంది. వంద మందికిపైగా దౌత్యవేత్తలకు ఇప్పటికే పిలిచి చెప్పిందని.. అంటున్నారు. భారత్ యుద్ధం చేయాలనుకోవడం లేదు కానీ ఉగ్రవాద శిబిరాలను మాత్రం వదలాలని అనుకోవడం లేదని అంటున్నారు. అయితే దూకుడుగా.. ఆవేశంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా.. ఉగ్రవాదుల వల్ల జరిగే నష్టం.. వారిపై దాడులు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.
ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పని సరి !
పహల్గాం ఎటాక్ తర్వాత భారత్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది. ఉగ్రవాద బాధిత దేశంగా.. తమ పై మరోసారి అలాంటి దాడులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికి వంద దేశాలకుపైగా ప్రతినిధులకు భారత ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చిందని అమెరికా మీడియా చెబుతోంది. కొంత మంది దౌత్యవేత్తలకు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల గురించి ఆధారాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల హమాస్ కు చెందిన వారు కూడా వచ్చి పాక్ సైన్యం ప్రేరేపిత లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వివరాలు బయటకు వచ్చాయి.
పీవోకే లో ఉగ్రవాద శిబిరాలపై పూర్తి సమాచారం
పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటిపై భారత్ పూర్తి సమాచారం సేకరించింది. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి.. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహం గురించి పూర్తి సాక్ష్యాలను సేకరించింది. ఉగ్రవాదుల్ని అంతం చేయాలంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేయక తప్పదని భారత్ వాదిస్తోంది. తాము ఆ పని చేయబోతున్నామని ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయవద్దని విజ్ఞప్తి చేస్తోంది. అలా చేయడం ఉగ్రవాదుల్ని సమర్థించడమే అవుతుందన్న సంకేతాలను భారత ప్రభుత్వం పంపుతోంది. పీవోకే ప్రస్తుతం పాక్ అధీనంలోనే ఉంది. భారత్ దాడి చేస్తే అది పాక్ భూభాగంలో చేసినట్లుగా అవుతుంది.
సన్నాహాలు పూర్తి చేసిన కేంద్రం
కేంద్రం రోజువారీగా ఉగ్రవాదులపై దాడుల సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పాకిస్తాన్ ఉన్న పళంగా వారిని పీవోకే నుంచి ఉగ్రవాద క్యాంపుల్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పాకిస్తాన్ సైన్యం వారిని తొందరపెడుతున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. తమ భూభాగంపై దాడి చేసినా.. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే.. ప్రపంచం మద్దతు భారత్ కే ఉంటుందని పాకిస్తాన్ కూడా అంచనా వేస్తోంది.