Smita Sabharwal Row: తెలంగాణలో IAS అధికారిణి స్మిత సభర్వాల్ బదిలీ వివాదం సద్దుమణగడం లేదు. మొదట్లో ఆమెకు ప్రాధాన్య లేని పోస్టు కట్టబెట్టడం... ఆ తర్వాత టూరిజం కార్యదర్శిని చేయడం.. మళ్లీ వెనక్కు పంపడం ఇదంతా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఆదివారం (27-04-2025 ) రాత్రి జరిగిన IAS అధికారుల బదిలీల్లో స్మితా సభర్వాల్‌ను కూడా బదిలీ చేశారు. IAS బదిలీలు సాధారణంగా జరిగేవే కానీ స్మిత ట్రాన్స్‌ఫర్ మాత్రం నార్మల్ గా జరగలేదు. ఆమెను నాలుగు నెలల్లోనే టూరిజం, యూత్ అఫైర్స్ కార్యదర్శి పదవి నుంచి వెనక్కు పంపారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. భగవద్గీత సందేశంతో సమాధానమిచ్చారు
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన-
భగవద్గీతలోని ఈ ప్రముఖమైన శ్లోకం తెలుసు కదా... ఈ సంస్కృత శ్లోకానికి అర్థం ఏంటంటే.. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితముల పైన లేదని.. ! ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా.. కర్మానుసారం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని శ్రీకృష్ణుడు అర్జునడికి చెబుతాడు.. ఫలితం కోసం చూడకుండా మన పని, విధులను మనం నిర్వర్తించాలనే సందర్భంలో ఎక్కువుగా దీనిని ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు IAS స్మితా సభర్వాల్ కూడా తను కార్యాలయంలో ఫోటోలను జతచేస్తూ.. ఈ వాక్యాన్ని రాశారు. ఓ IAS ట్రాన్స్‌ఫర్ జరగడం సాధారణ అధికారిక ప్రక్రియలో భాగం అనుకోవచ్చు. అలా సాధారణంగా జరిగితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 16నెలల కాలంలో స్మిత సభర్వాల్.. ప్రభుత్వానికి సంబంధించి చాలా జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆమెను ప్రాధాన్యత లేని పోస్టులోకి మార్చడం... మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకురావడం.. ఆ వెంటనే వెనక్కు పంపడం.. ఇాలా వరుసగా జరిగాయి. ఈ మధ్య కాలంలో స్మిత సభర్వాల్.. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం చేశారు. ఫలితంగానే ఈ ట్రాన్సఫర్.
పాలసీని తెచ్చా.. బాధ్యతను పెంచా
అయితే బదిలీ విషయం సాధారణమే అని చెబుతూ.. ఈ నాలుగు నెలల్లో తానేం చేశానో వివరించారు స్మిత సభర్వాల్.. X వేదికగా ఓ పోస్టును పెట్టిన ఆమె.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ టూరిజం పాలసీని అమల్లోకి తీసుకొచ్చాను అని చెప్పుకున్నారు. శాఖలో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి పారదర్శకతను తీసుకొచ్చామన్నారు.
1.. టూరిజంలో ఉన్న నాలుగు నెలల్లో చాలా మార్పులు తీసుకొచ్చాను. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పర్యాటక పాలసీ 25-30 ని అమలు చేశాను. ఇప్పటి వరకూ సరిగ్గా దృష్టి సారించని టూరిజం సర్క్యూట్లలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించాను
2. పర్యాటక శాఖలో పనితీరు మార్చేశాను. పారదర్శకత తీసుకొచ్చాను
3. గ్లోబల్ ఈవెంట్ ( మిస్ వరల్డ్ ) కు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తి చేశాను. ఇది భవిష్యత్‌లో చాలా ఈవెంట్లకు దోహదం చేస్తుంది.
వెనక్కు తగ్గని స్మిత- వెనక్కి పంపిన ప్రభుత్వం
స్మితా సభర్వాల్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మొదటి నుంచి ఉంది. కిందటి కేసీఆర్ ప్రభుత్వంలో CMOలో చాలా ముఖ్యమైన శాఖలను ఆమె పర్యవేక్షించారు. బీఆర్‌ఎస్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ వంటి వాటని ఎగ్జిక్యూట్ చేశారు. అప్పటి ప్రభుత్వాధినేతలకు సన్నిహితం అనే పేరుండటంతో ఈ ప్రభుత్వం ఆమెను దూరంగా ఉంచింది. అంతగా ప్రాధాన్యం లేని తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి గా సీనియర్ IAS అయిన ఆమెను పంపారు. ఆ తర్వాత ఏడాదికి ఆమెను కొంచం ప్రాధాన్యత ఉన్న టూరిజం శాఖకు తీసుకొచ్చారు. ఈలోగానే మిస్ వరల్డ్ గ్లోబల్ ఈవెంట్ కూడా వచ్చింది. దాని బాధ్యతలు చూస్తున్నారు.
ఇలా జరుగుతుండగానే కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వాయిస్‌కు స్మిత మద్దతు ఇచ్చారు. కంచ గచ్చిబౌలిలో వన్య ప్రాణులకు హాని కలిగేలా ప్రభుత్వం చెట్లు కూల్చేస్తోందనే అర్థం వచ్చేలా AI తో రూపొందించిన ఫోటోను ఈెమె తన సోషల్ మీడియా హ్యాండిల్ లో రీపోస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. దానిపై ఆమెకు నోటీసులు ఇవ్వడం.. దానికి సమాధానమిస్తూ.. మళ్లీ సోషల్ మీడియాలో ప్రశ్నించడం జరిగాయి. IAS అధికారిణి అయి ఉండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వాయిస్‌ను ఆమె ఎలా సమర్థిస్తారు అన్నది ప్రభుత్వ వాదన. కానీ తను మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత కూడా తన వాదనను బలపరిచే... పోస్టులను ఆమె చాలా షేర్ చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆమెను మళ్లీ పాత పోస్టులోకే పంపింది.