Andhra style Avakaya : వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి.. కాసింత నెయ్యి ఎవరికి నచ్చదు చెప్పండి. అదే పప్పుతో కలిపి తింటే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే దీనిని సమ్మర్లో దాదాపు ప్రతి ఇంట్లో ఓ సాంప్రదాయంగా పడతారు. అయితే ఆవకాయ పచ్చడి పాడవకుండా.. ఏడాదంతా మంచి రుచితో ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మామిడి కాయలు - 20 (3 కేజీల ముక్కలు)
పల్లీ నూనె - 2 లీటర్లు
కారం - అర కిలో
ఆవపిండి - 450 గ్రాములు
మెంతి పిండి - 150 గ్రాములు
పసుపు - 3 చెంచాలు
ఉప్పు - 300 గ్రాములు
వెల్లుల్లి - 150 గ్రాములు
తయారీ విధానం
ముందుగా మామిడికాయలను కడుక్కుని.. శుభ్రంగా తడిలేకుండా తుడుచుకుని పైన కాడలని కోసుకోవాలి. కాసేపు మామిడి కాయలను గాలికి ఆరనిచ్చి.. సమానమైన ఆవకాయ ముక్కలుగా కోసుకోవాలి. కాయని కోసిన తర్వాత లోపలున్న జీడి.. దానికింద ఉన్న పొర రెండూ లేకుండా తీసేయాలి. ఇలా ముక్కలన్నీ చేసుకున్న తర్వాత.. మరోసారి ముక్కలు తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాసేపు ఆరబెట్టుకోవాలి. దీనివల్ల తడిపోతుంది. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి.. ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
ఆరబెట్టుకున్న ముక్కలను ఓ గిన్నెలో తీసుకుని.. దానిలో లీటర్ నూనె వేసుకుని కలుపుకోవాలి. దీనివల్ల ముక్క ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది. అయితే పచ్చడి పట్టుకునే ముందు రోజు నుంచే ఆవాలు, మెంతులు, ఉప్పు లేదా సాల్ట్ విడివిడిగా ఆరబెట్టుకోవాలి. పచ్చడి పట్టుకునే రోజు వాటిని పౌడర్‌గా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా పైన పొట్టు తీసుకోవాలి. పచ్చడి పట్టుకునే ముందే వీటిని తీసుకుంటే వెల్లుల్లి అరోమా కూడా పచ్చడికి వచ్చి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దానిలో మామిడి ముక్కలు వేసుకోవాలి. దానిలో ఎలాంటి మసాల లేని పచ్చి కారం.. ఆవ పిండి, మెంతి పిండి వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లి వేసుకుని బాగా కలపాలి. మిగిలిన నూనె కూడా వేసి ముక్కలకు అన్ని బాగా కలిసేలా, పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఆవకాయను ఓ గాలి చేరని కంటైనర్‌లో లేదా జాడీలో స్టోర్ చేసుకోవాలి. మూత గట్టిగా పెట్టాలి.
ప్రతి రోజూ ఉదయం తడి చేతులు లేకుండా, గరిట తడిలేకుండా చూసుకుని పచ్చడిని కలుపుకోవాలి. మొదటి రోజు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తగినంత తలుపుకోవాలి. పచ్చడి ముక్క నూనెలో ఉండేలా చూసుకోవాలి. ఇలా మూడు రోజులు కలిపిన తర్వాత దానిని ఇంక కలపాల్సిన అవసరం లేదు. పచ్చడిని జాడీలోకి మార్చుకుని దానిలోకి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నిల్వ ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఈ సమ్మర్లో టేస్టీ ఆవకాయ పచ్చడిని పట్టేసుకోండి. ఏడాదంతా ఎంజాయ్ చేయండి. చెప్పిన జాగ్రత్తలు ఫాలో అయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది.