జమ్ముకశ్మీర్‌లోని అందమైన కశ్మీర్‌ లోయలో సోమవారం అందాల తారలు సందడి చేశారు. ప్రపంచ సుందరితో పాటు పలువురు సుందరీమణులు ఇక్కడికి రావడంతో కశ్మీర్‌ లోయ మరింత ఆకర్షణీయమైంది. మిస్‌ వరల్డ్‌ కరోలినా బిలాస్కా ఒక్క రోజు పర్యటన నిమిత్తం నిన్న కశ్మీర్‌కు వచ్చారు. పోలాండ్‌ దేశానికి చెందిన ఈమెతోపాటు మరికొందరు అందగత్తెలు కూడా వచ్చారు. పోలిష్‌ మోడల్‌, టీవీ ప్రెజంటర్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ అయిన కరొలినా 2021 మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్నారు. వచ్చే 71 వ మిస్‌ వరల్డ్‌ పోటీలు భారత్‌లో జరగనున్న వేళ కశ్మీర్‌లో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు ఆమె విచ్చేశారు. భారత్‌లో చివరగా 1996లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయి.


కరొలినా మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోని ఇంత అందమైన కశ్మీర్‌ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం లభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కశ్మీర్‌ సౌందర్యం తనను మెస్మరైజ్‌ చేసిందన్నారు. ఈ ప్రాంతం ఇంత అందంగా ఉంటుందని తాను ఊహించలేదని, కానీ కశ్మీర్‌ తనను అందంతో కట్టిపడేసిందని సంతోషం వ్యక్తంచేశారు. భారతదేశం సంస్కృతిని తెలుసుకోవడం తనకు చాలా నచ్చిందని అన్నారు.2023 మిస్‌ వరల్డ్‌ పోటీలో భారత్‌ జరగనుండడం చాలా ఎగ్జైటింగ్‌ ఉందని కరొలినా అన్నారు. 


మిస్‌ వరల్డ్‌ కరొలినా తన కశ్మీర్‌ పర్యటనలో భాగంగా నిషాత్‌ బాగ్‌లో కశ్మీరీ దుస్తులు ధరించి సందడి చేశారు. కశ్మీర్‌ చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయని తనకు తెలుసని, కశ్మీర్‌ గురించి మాట్లాడుతుంటామని  ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఈరోజు ఇక్కడి అందాలను నేరుగా చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌గా ఉందన్నారు. అందరూ తమను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. 140 దేశాలను, తన స్నేహితులను, కుటుంబసభ్యులను కశ్మీర్‌కు తీసుకురావడానికి, ఇక్కడి అందాలను చూపించడానికి తాను వేచి ఉండలేకపోతున్నానని అన్నారు.


 కశ్మీర్‌, దిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాలను వారికి చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆమె భారత్‌కు రావడం మూడోసారి అని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుందని, భారత దేశం చాలా వైవిధ్యమైనదని ప్రశంసలు కురిపించారు. అయితే ప్రతి రాష్ట్రంలో అద్భుతమైన ఆతిథ్యం కామన్‌ విషయమని చెప్పారు. భారత్‌లో ఎక్కడికి వెళ్లినా ఎంతో మంచిగా ఆతిథ్యమిస్తారని పేర్కొన్నారు. తనకు గోవా వెళ్లాలని ఉందని, అలాగే మణిపూర్‌, బెంగళూర్‌ తదితర ప్రాంతాలు సందర్శించాలని ఆసక్తిగా ఉందని చెప్పారు. ఇండియా చూడడానికి ఒక నెల కూడా సరిపోదని చెప్పుకొచ్చారు.


కరొలినాతో పాటు మిస్‌ వరల్డ్‌ ఇండియా సినీశెట్టి, మిస్‌ వరల్డ్‌ కరేబియన్‌ ఎమ్మీ పెనా కశ్మీర్ లోయలో తిరుగుతూ అక్కడి సంస్కృతి కళల గురించి తెలుసుకున్నారు. కశ్మీరీ హ్యాండీక్రాఫ్ట్స్‌ చూడడానికి షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌ను సందర్శించారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌, సీఈఓ మిస్‌ జులియా మోర్లే మాట్లాడుతూ శ్రీనగర్‌ను సందర్శించడం చాలా మంచి అనుభూతి అని అన్నారు. ఇక్కడి ప్రతి నిమిషం ఎంతో ఆస్వాదించామని వెల్లడించారు. ఇక్కడి వచ్చిన అందగత్తెలంతా కశ్మీర్‌ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి మరింత అందంగా కనిపించారు. అందరూ జీలం నది అందాలను చూసి ఎంతో ఆనందించారు.