తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, లోక్‌సభ ఎన్నికలకు కూడా కొన్ని నెలల సమయమే ఉంది. దీంతో ఓటర్ల జాబితా తుది మెరుగులు దిద్దుకుంటోంది. కనుక త్వరపడండి... ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే తెలుసుకోండి. ఓటు ఉంటేనే ఒక పౌరుడిగా మీ నాయకుడిని ఎన్నుకోగలరు. ఓటు లేకపోతే.. మళ్లీ నమోదు చేయించుకోండి. అది ఎలా అంటారా...? దానికి ఎన్నో మార్గాలు కల్పించింది ఎన్నికల కమిషన్.
https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో వెళ్తే.. పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉంటాయి. మీరు ఉంటున్న ఏరియా... ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో చూసుకుని, ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో మీ పేరు ఉందా? లేదా చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే సెర్చ్ యువర్ నేమ్ అనే సబ్ కేటగిరీ కూడా ఉంటుంది.
ఇక, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ద్వారా... ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. http//voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఎలక్టోరల్ కాలంపై క్లిక్ చేసి.. ఫోటో గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్ ఎంటర్ చేస్తే... జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తోంది. ఈ పేరు ఉంటే.. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది... సీరియల్ నంబర్ ఎంత.. లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ, మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ తెలియకపోతే.. అడ్వాన్స్ సెర్చ్ కాలంలోకి వెళ్లి... మీ పేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయడం ద్వారా కూడా ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఈ రెండూ కాక... మరో మార్గం కూడా ఉంది. NVSP వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కేటగిరీ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే రెండు సబ్ కేటగిరీలు కనిపిస్తాయి. అక్కడ మీపేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను ఎంటర్ చేసి లేదా ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
గూగుల్‌ప్లే స్టోర్‌లోనూ భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ చేయగానే... పైభాగంలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కాలం కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ బై బార్ కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించి మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీ పేరు, మీ తండ్రి పేరు, వయస్సు, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలను ఇవ్వడం ద్వారా లేదా ఫోటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ఎంటర్ చేయడం ద్వారా కూడా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు.
మీ ఓటు లేకపోతే మాత్రం.. కొత్తగా ఎల్‌రోల్ చేయించుకోండి. ఇందుకోసం... www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫారం-6 అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నింటినీ నింపి సబ్‌మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. ఆన్‌లైన్ చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేస్తారు.
పోలింగ్ కేంద్రాల ద్వారా కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారి అంటే బీఎల్‌ఓ ఉంటారు. వారి దగ్గర పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితా పరిశీలించి మీ ఓటు ఉందో..లేదా? కూడా చూసుకోవచ్చు. అంతేకాదు... ప్రతి నియోజకవర్గానికి డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా, ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించింది ఎన్నికల సంఘం. వారి కార్యాలయాలకు వెళ్లి కూడా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు విచారణ జరిపి ఓటు హక్కు కల్పిస్తారు.