Vidala Rajani In King George Hospital Visakha: నారా లోకేష్ యువగళం చూస్తే టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు మంత్రి విడుదల రజిని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. నారా లోకేష్ చేస్తున్నది వృథాయాత్ర అని చెప్పుకొచ్చారు.
ఏపీ అడ్వాంటేజ్ పేరిట విశాఖను అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు వివరించారు విడదల రజిని. వైజాగ్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు. సీఎం వైజాగ్ వస్తారని చెప్పడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఐటీ పరంగా, పారిశ్రామికంగా విశాఖ చురుకుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సీఎం విశాఖకు వస్తే ప్రజలు ఊహించని ప్రగతిని చూస్తారని అన్నారు.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కోటి రూపాయలతో నిధులతో రాజేంద్రప్రసాద్ వార్డు ఆధునీకరణ పనులను వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్యాన్సర్ క్రిటికల్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఉన్నారు.
120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్
2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి విడుదల రజినీ తెలిపారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. ఏపీ బడ్జెట్‌లో 400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారన్నారు. కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించినట్లు వెల్లడించారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలను బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్‌కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి విడుదల రజిని స్పష్టం చేశారు.
పూర్తి ఉచితంగా, వేగంగా పేదలకు వైద్యం
మంత్రి రజని మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా, వేగంగా అందించేందుకు జగన చిత్త శుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎంత ఖర్చైనా చేయడానికైనా వెనుకాడటం లేదని తెలిపారు. నెలకు రూ.3లక్షల కంటే ఎక్కువ చెల్లించేలా బిడ్డింగ్ పద్ధతి ద్వారా నిపుణులైన వైద్యుల నియామకం చేపడుతున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఈ మధ్యే ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో మాట్లాడుతూ స్వయంగా చెప్పారు. ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు విశాఖపట్నంలోనే జరగనుందని జగన్ చెప్పారు.