Minister Sridhar Babu Comments: బీఆర్ఎస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీట్ కూడా గెలవదనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఒక్క సీట్ కూడా గెలవకపోతే పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. అందుకే ఈ రకమైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం (జనవరి 4) మంత్రి శ్రీధర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘ఏడో తేదీన ప్రభుత్వం ఏర్పడింది. సీఎం డిప్యూటీ సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాం. మీరు 2018 లో ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు పెట్టారు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత, నెల గడిచిన తర్వాత కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి వరకూ ముఖ్యమంత్రి మాత్రమే పదవిలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. సుమారు రెండు నెలల తర్వాత మంత్రి వర్గం ఏర్పాటు చేశారు. ఇది బాధ్యత రాహిత్యం కాదా? ప్రజలు ఇచ్చిన తీర్పును అపహస్యం చేశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపారు


ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో ఇచ్చిన హామీల అమలు మేం మొదలు పెట్టాము. హామీల్లో రెండు ప్రధానమైన హామీలు మహిళా సోదరీమణుల కోసం ఫ్రీ బస్ సర్వీస్ సేవలు ప్రారంభించాం. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు సేవలు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ స్వేచ్ఛగా తన సొంత బస్ లాగా భావిస్తూ సేవలు వినియోగించుకుంటున్నారు. పదేళ్ల నుంచి ప్రజారోగ్యం గాలికి వదిలేసిన పార్టీ, ప్రభుత్వం బీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాము. ఇది ప్రతి పేద కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.


ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన ఒక బుక్ లెట్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. వాళ్లు తెలంగాణను 3,500 రోజులు పాలించారు. కాంగ్రెస్ వచ్చి 35 రోజులు కూడా కాలేదు అప్పుడే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఓర్వలేక నియంతృత్వ దోరణి ప్రదర్శిస్తున్నారు. మానిఫెస్టో పట్ల కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవరిస్తున్నారు.


ఎందుకు ఇంత గగ్గోలు.. ఎందుకింత తొందరపాటు..


ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తూ వస్తున్నాము. మీ దగ్గర మంచి సూచనలు ఉంటే మాకు ఇవ్వండి మేము స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ప్రతిపక్షం సూచనలు బాగుంటే స్వీకరిస్తాను అని. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించి అప్పుల పాలు చేసి.. ఇప్పుడు మేం వచ్చిన 30 రోజులకే ఇంత అహంకారంగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారు. 


బీఆర్ఎస్ భవన్ లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడం కాదు ఒక్కసారి గ్రామంలోకి వెళ్లి అక్కచెల్లెళ్ళని అడగండి..వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రజా పాలన ఎలా ఉందో ఉంటుందో కళ్ళారా చూస్తూనే ఉన్నారు కాదా. ప్రజా దర్బార్ పెట్టి వేలాది మంది వచ్చి విజ్ఞప్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారైనా మీరు ప్రజలను కలిశారా వాళ్ల గోస విన్నారా? లేదు అందుకే మీ అహంకార పూరిత పాలనకు చరమగీతం పాడారు. అయినా ఇంకా మారకుండా అర్థం లేని ఆరోపణ చేస్తున్నారు.


కేంద్రం విభజన హామీల్లో ఏ ఒక్కదానిలో అయినా పోరాటం చేశారా? బయ్యారం ఉక్కు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ట్రైబల్ యూనివర్సిటీ, ఏ ఒక్కదాని పైనా మీరు ఉద్యమించిన దాఖలాలు లేవు. ముందు పార్టీని చక్కదిద్దుకోవాలి... అంతేగానీ అధికారం దూరమయ్యిందనే అక్కసుతో ఆరోపణ చేయడం అధికార దుగ్ధగా కనిపిస్తోంది. కొంతమంది ఆటో డ్రైవర్ లను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దు అని భావిస్తున్నారా? ఓపెన్ చెప్పాలి అంతేగాని రాజకీయాల కోసం ఆటో డ్రైవర్స్ ను బలి చెయ్యొద్దు. వారికి న్యాయం చేసే కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని శ్రీధర్ బాబు మాట్లాడారు.