Minister RK Roja News: సాధారణంగా తన అభిమాన హీరో, రాజకీయ నాయకుల పుట్టిన రోజుల సందర్భంగా ఒక్కోక్కరు ఒక్కో విధంగా తమ అభిమానంను చూపిస్తూ పుట్టిన రోజులు వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు.. అయితే ఏపి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి రోజా తనదైన శైలిలో జగనన్నకి పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చారు.. ప్రతి ఏడాది రోజా ఎంతగానో అభిమానించే జగనన్న పుట్టిన రోజు సందర్భంగా ఒక్కో స్పెషల్ గా వైఎస్ అభిమానులంతా ఆశ్చర్య పోయే విధంగా సామాజిక బాధ్యతతో నిరుపేదలకు అండగా నిలిచే నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అయితే ఈసారి ఓ నిరుపేద కుటుంబంకు బంగారు భవిష్యత్తునిస్తూ జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అంతేకాకుండా సాంటా క్లాజ్ వేషంలో వెళ్ళి బహుమతులు అందజేశారు.. ఆ నిరుపేద కుటుంబంలో ఆనందం చూసారు..
ఓ నిరుపేద కుటుంబంకు చెందిన నాగరాజు విజయవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్నారు.. పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏ రోజు జీవితంతో రాజీపడలేదు.. ఇతను రోడ్డు మీద చెప్పులు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు.. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.. భర్త శ్రమకి భార్య కూడా తోడై నాలుగు ఇండ్లల్లో పని చేసి ఇద్దరు కలిసి వారి ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు నివ్వాలని నాలుగు కాసులు పోగు చేసుకున్నారు. తమ పిల్లలకి మంచి చదువునిచ్చి ఏ లోటూ లేకుండా చూసుకోవాలని భావించారు. వీరి జీవితంలో విధి ఆట మొదలయ్యింది.. భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీ తొలగించడంతో ప్రస్తుతం మంచానికి పరిమితమయ్యింది.. ఆమె వైద్యానికి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చుపెట్టేశారు.. ఇక నాగరాజుకి కూడా ఆరోగ్యసమస్యలు మొదలయ్యాయి. ఇలా వీరి జీవితం నలుగుతోంది ఇద్దరు ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న నాగరాజుకి జగన్ ప్రభుత్వం ఇస్తున్న వికలాంగ పెన్షన్ తో ఇల్లు గడుస్తోంది..
నాగరాజు పరిస్థితి మంత్రి రోజా దృష్టికి వెళ్ళింది. తనని సాయంకోరి వచ్చిన వారికి అండగా నిలిచిన కథనాలు ఎన్నో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుకి అనాథ విద్యార్థిని దత్తత తీసుకొని ఆమెను ఎంబీబీఎస్ చదివిస్తున్నారు.. మరో పుట్టిన రోజుకి ఏకంగా తన నియోజకవర్గంలో ని మీరాసాబ్ పాళ్యం అనే గ్రామాన్నే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.. రోజా చల్లని చూపు ఈ సారి నాగరాజు కుటుంబాన్ని వరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గా పుట్టిన రోజున నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాతగా మారి నాగరాజు పిల్లలకి చాక్లెట్లు బిస్కేట్లు, కేక్ తీసుకెళ్ళారు. నాగరాజు తలుపు తట్టి సర్‌ప్రైజ్ చేశారు. ఆ అభాగ్యుడి ఇంట్లో పండుగ వాతావరణం వచ్చింది.. సీఎం జగన్ పుట్టిన రోజును ఆ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.. వారి యోగక్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించవచ్చునని ధైర్యం చెప్పి వచ్చారు.
అపురూపమైన కథనం గురించి మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ... నాగరాజు నిజ జీవిత కథ తనని ఎంతగానో కదిలించిందని తన తండ్రి పేరు నాగరాజు అని అన్నారు. ఇక్కడ నాగరాజు తన పిల్లను కాపాడుకోవాలని పడుతున్న తపన తనని భావోద్వేగానికి గురి చేసిందని, ఆ కుటుంబానికి అక్కగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అది కూడా తనకు ఇష్టమైన తన అన్న ఆంధ్రప్రదేశ్ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ సంకల్పం తీసుకున్నానని వీళ్ళ దీవెనలే నా అన్నకి శ్రీరామ రక్ష అని అన్నారు. మనకి నచ్చినవారి పుట్టినరోజుకి విలువైన బహుమతి కన్నా విలువలతో కూడిన బహుమతి మిన్న’ అని అన్నారు.