Baby with Tail: వైద్య చరిత్రలో మరో వింత నమోదైంది. ఈశాన్య మెక్సికోలోని ఒక గ్రామీణ ఆసుపత్రిలో 2 అంగుళాల పొడవు గల తోకతో ఒక ఆడ శిశువు జన్మించింది. తోకతో పుట్టిన శిశువును చూసి డాక్టర్లు, నర్సులు, తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


ఏం జరిగిందంటే


ముప్పై ఏళ్ల లోపే ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భం దాల్చిన సమయం నుంచి అంతా సాధారణంగానే ఉందని ఎలాంటి సమస్యలు లేవన్నారు వైద్యులు. ప్రసవం జరిగాక తోకతో పుట్టిన శిశువును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 5.7 సెంటి మీటర్ల పొడవు, వెంట్రుకలతో కప్పబడి, చివరన కొద్దిగా ఎడమ వైపునకు వంగి ఉన్న తోకను చూసి డాక్టర్లు ఎక్స్ రే తీశారు.


తొలగించిన వైద్యులు


2 నెలల తర్వాత చిన్న శస్త్ర చికిత్స చేసి వైద్యులు ఆ తోకను తొలగించారు. ఎలాంటి సమస్యలు లేకుండా శస్త్ర చికిత్స పూర్తవడంతో అదే రోజు శిశువును డిశ్చార్జ్ కూడా చేశారు.


ఇలాంటి ఘటనలు


డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం 2017 వరకు ప్రపంచంలో 195 మంది నిజమైన తోకతో జన్మించారు. వీటిలో అతి పెద్ద తోక పొడవు 20 సెంటీ మీటర్లు. ఈ అసాధారణ ఘటనలు అబ్బాయిల్లో ఎక్కువ జరిగాయి. ఇలా జన్మించిన ప్రతి 17 మందిలో ఒకరు మెదడు, పుర్రె ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. 2021లో బ్రెజిల్‌కు చెందిన ఓ శిశువు 12 సెంటిమీటర్ల పొడవు, తోక చివర్లో బంతి వంటి నిర్మాణంతో జన్మించింది.