Hyderabad News: హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం జరిగింది. తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ బాలికపై ఐదుగురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక పదో తరగతి చదువుతుండగా.. అదే తరగతికి చెందిన బాలురు ఈ దారుణానికి ఒడిగట్టారు. అత్యాచారం నలుగురు విద్యార్థులు అత్యాచారం చేస్తుండగా.. ఓ విద్యార్థి దాన్ని వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే బెదిరిస్తామంటూ భయపెట్టారు. వీడియో అందరికీ షేర్ చేస్తామని బెదిరిస్తూ.. పది రోజుల తర్వాత మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఐదో విద్యార్థికి ఛాన్స్ ఇవ్వలేదనే కోపంతో అతడు.. ఈ వీడియోని 50 మందికి పంపించాడు. అయితే ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
ఆడ బిడ్డల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. ఎక్కడో చోట కామాంధుల పశువాంఛకు మహిళలు బలవుతునే ఉన్నారు. తాజాగా.. పదో తరగతి విద్యార్థినిపై అదే తరగతికి చెందిన ఐదురుగు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏబీపీతో అధికారులు చెపిన వివరాల ప్రకారం.. హాయత్ నగర్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా వందనం కార్యక్రమం తరవాత బాలిక బాత్రూంకు వెళ్లింది. అదే సమయంలో ఆమె వెనుకే వెళ్లిన మిగతా ఐదుగురు బాలురు.. బాలికతో మాట్లాడుతూ నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వీడియోని ఐదో విద్యార్థి సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరితో అయిన చెబితే ఈ వీడియోని అందరికి చూపిచడంతో పాటు సోషల్ మీడియాలో పెడ్తానంటూ భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో బాలిక ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే ఈ ఘటన లో అందరూ మైనర్ లే.
వైరల్ అయిన వీడియోలు.. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు
ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్లీ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఐదో విద్యార్థికి అవకాశం ఇవ్వలేదని కోపంతో అతడు ఆ వీడియోలను 50 మందికి పంపాడు. అలా వైరల్ అయిన వీడియో బాలిక తల్లిదండ్రులకు వచ్చింది. దీంతో బాలికను నిలదీసి అడగ‌్గా బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించిన ఫలితం దక్కకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలికల వసతి గృహంలో చేర్చారు.
ఇలాంటి దారుణ ఘటనలు ఏమైనా జరిగితే వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పాలని పోలీసులు చెబుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా తమ వద్దకు వస్తే న్యాయం చేసేలా చూస్తామని వివరిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి అఘాయిత్యాలను ఆపగలమంటున్నారు.