Drugs Seized In Meghalaya:



మేఘాలయలో సీజ్‌..


డ్రగ్స్ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిఘా పెడుతున్నా కళ్లుగప్పి మరీ తరలిస్తున్నాయి కొన్ని ముఠాలు. అయినా ఈ ముఠాలను పట్టుకుని పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అలెర్ట్ అవుతున్న పోలీసులు కోట్ల రూపాయ విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. మేఘాలయలో గతేడాది భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్టు ప్రకటించారు డీజీపీ ఎల్‌ఆర్ బిష్ణోయ్. రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 50 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ డ్రగ్స్ లభ్యమవలేదని చెప్పారు. గతేడాది ఇలా డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న వారిలో  234 మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. రూ.45.22 కోట్ల విలువైన 7 కిలోల హెరాయిన్‌తో పాటు రూ.1.38 కోట్ల విలువైన 27 వేల కాఫ్ సిరప్ బాటిళ్లనూ సీజ్ చేశారు. 5 టన్నుల గంజాయి, 600 గ్రాముల ఓపియం, 1,200 మెత్ ట్యాబ్లెట్‌లనూ స్వాధీనం చేసుకున్నారు.116 కేసులు నమోదైనట్టు వివరించిన డీజీపీ బిష్ణోయ్..అరెస్టైన వారిలో 20 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. గత రికార్డులన్నీ బద్దలు కొట్టి గతేడాది ఎక్కువ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో ట్రాఫికింగ్ జరిగే అవకాశముందని, ఆ ముఠాలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.


"ఈ ఏడాది మొదట్లోనే 70 రోజుల్లోనే 80 మందిని అరెస్ట్ చేశాం. 3 కిలోల హెరాయిన్, 140 కిలోల గంజాయి, 60 వేల ట్యాబ్లెట్‌లు, 22 వేల కాఫ్ సిరప్ బాటిళ్లు సీజ్ చేశాం. రూ.28 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం. అరెస్టైన వారిలో 25% మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. త్రిపుర, మిజోరం, మణిపూర్, పంజాబ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో టెస్ట్‌లు ఆలస్యంగా అవుతుండటం వల్ల ఈ లోగా నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారు"


- ఎల్ఆర్ బిష్ణోయ్, డీజీపీ, మేఘాలయ