ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత ముప్పై ఏళ్లుగా తన సంగీత ప్రవాహంలో మనల్ని ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన పాటలు అందించారు. ఓవైపు కమర్షియల్ సినిమాకు సంగీతం అందిస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక భక్తి రస చిత్రాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించడం ఆయనకే చెల్లింది. స్వతహాగా సంగీత దర్శకుడే అయినా.. గాయకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి. 

 

ప్రస్తుతం ఎంఎం కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఆయన సంగీతం సమకూర్చిన RRR సినిమా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అందులోని 'నాటు నాటు' పాట ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుని.. ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో వుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఎక్కడ చూసినా కీరవాణి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆయనకు అనేక మారుపేర్లు ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

 

తెలుగు చిత్రాలకు 'MM కీరవాణి'గా.. తమిళంలో 'మరకతమణి' అని, హిందీలో 'MM క్రీం' అనే పేరుతో ఆయన పేరుగాంచారు. 'బాహుబలి', 'RRR' చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తర్వాత, కీరవాణి ఇలా వేర్వేరు ఇండస్ట్రీలలో వేర్వేరు పేర్లు ఉండటంపై ఆసక్తి నెలకొంది. 

 

నిజానికి ఎంఎం కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. ఆయన పేరులోని భాగమైన 'మరకతమణి' ని తమిళ్ మలయాళ చిత్రాలలో స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు. ఇక 1994లో మహేష్ భట్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'క్రిమినల్' సినిమాతో హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు కీరవాణి. అయితే ఒక కొత్త మ్యాజిక్ డైరక్టర్ గా 'ఎంఎం క్రీమ్' అనే స్క్రీన్ నేమ్ తో బాలీవుడ్ జనాలకు పరిచయమయ్యారు. 

 

'సుర్' అనే హిందీ చిత్రానికి (స్వాతి కిరణం సినిమాకి రీమేక్) ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెన్నైలోని ఓ స్టూడియోలో గీత రచయిత నిదా ఫజ్లీకి కీరవాణిని కనుగొనడం చాలా కష్టమైందట. ఎందుకంటే ఎంఎం క్రీం, కీరవాణి ఒకరే అని ఆయనకు తెలియలేదు. ఒక సంగీత దర్శకుడికి మూడు పేర్లు ఉన్నాయని ఫాజ్లీ నమ్మలేకపోయాడట. "నీకు నువ్వు దేవుడిగా భావిస్తున్నావా?" అని కూడా కీరవాణిని ఫాజ్లీ ప్రశ్నించారట. అలాంటి క్రీమ్ ఇప్పుడు తన పాటతో బాలీవుడ్ మీడియా అంతా మాట్లాడుకునేలా చేశాడని చెప్పాలి.

 

ప్రముఖ రచయత శివ శక్తి దత్తా కుమారుడైన కీరవాణి... తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పని చేశారు. 1990లో వచ్చిన 'మనసు మమత' సినిమాతో ఆయనకు బ్రేక్ దొరికింది. క్షణ క్షణం (1991) సినిమాకి కీరవాణి తన మొదటి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. 

 

కీరవాణి ఇన్నేళ్ల సినీ కెరీర్లో 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులను, 11 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పలు ఇతర అవార్డులను అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 

 


 

RRR సినిమాలో కీరవాణి స్వరపరిచిన 'నాటు నాటు' సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటుగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు సాధించింది. అలానే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ క్యాటగిరీలో నామినేట్ అయింది. భారతీయ సినీ సంగీతాన్ని  నెక్స్ట్ లెవల్ కి తీసుకుని పోయిన ఎంఎం కీరవాణి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పాలి. ఇండియన్ సినీ చరిత్రలో ఓ పాటకు ఈ విధమైన పట్టాభిషేకం జరగడం ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో మైలురాళ్లను అదిగమిస్తూ తెలుగు సినీ సంగీతాన్ని ఎంఎం కీరవాణి అకా ఎంఎం క్రీం ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుందాం!