Youngest Baba at Maha Kumbh 2025: యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13, 2025 నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళానికి లక్షలాది మంది భక్తులు, సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు హాజరుకానున్నారు. సాధారణంగా సాధువులంటే మధ్య లేదా వృద్ధాప్యంలో ఉండే సాధువులను చూస్తుంటాం. కానీ ఓ 3 ఏళ్ల బాలుడు సాధువుగా మారాడు. భిన్నమైన జీవన శైలితో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు మహా కుంభమేళాలో ఆ బాలుడే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తల్లిదండ్రులతో హాయిగా గడపాల్సిన వయసులో, ఆటపాటలతో ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఓ బాలుడు సాధువుగా మారాడు. శ్రావణ్ పూరి అనే 3.5 ఏళ్ల సాధువు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అతిపెద్ద సాధువుల సమూహాలలో ఒకటైన జునా అఖారాలో ఆయన అతి చిన్న బాబాగా అవతరించాడు. చిన్న వయసులోనే జునా అఖారాలో చేరిన ఆ బాలుడు.. ఇప్పట్నుంచే ఆధ్వాత్మిక జీవితాన్ని అనుసరిస్తున్నాడు. ఇప్పటికే జునా అఖారాకు చెందిన బాబాలు అతనికి సాధువు హోదాను ఇవ్వడం గమనార్హం. ఎందుకంటే సాధువులు, సన్యాసుల జీవన శైలినే శ్రవణ్ అనుసరిస్తున్నాడు. తన వయస్సులో ఉన్న చాలా మంది పిల్లలలా కాకుండా, శ్రవణ్ పూరి చాక్లెట్ల కంటే పండ్లను ఇష్టపడతున్నాడు. శిబిరంలో తన గురు సోదరులతో ఆడుకుంటూ గడిపుతున్నాడు. శ్రావణ్ పూరి జునా అఖారా అన్ని ఆచారాలను నిష్టగా పాటిస్తున్నాడు. శ్రవణ్ పూరి ప్రవర్తన సాధారణ పిల్లలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మ, నాన్న అనే పదాలు తప్ప ఏమీ తెలియని వయసులో ఆ బాలుడు సాధువులతో కలిసి శ్లోకాలు, మంత్రాలు చెబుతున్నాడు.

బిడ్డను ఆశ్రమానికి దానం చేసిన దంపతులు

హర్యానాలోని ఫతేహాబాద్‌లోని ధార్సుల్ ప్రాంతానికి చెందిన ఒక జంట ఫిబ్రవరి 2021లో డేరా బాబా శ్యామ్ పూరి ఆశ్రమానికి శ్రవణ్ పూరిని విరాళంగా ఇచ్చారు. అప్పటికి ఆ బాలుడి వయసు కేవలం మూడు నెలలే. దంపతుల కోరిక తీర్చినందుకు ప్రతిఫలంగా, వారు ఆశ్రమానికి బిడ్డను దానం చేశారు. ఈ విషయాన్ని శ్రవణ్ పూరి గురు అష్టకౌశల్ మహారాజ్ సంత్ పూరి స్పష్టం చేశారు.  "ఆశ్రమానికి వచ్చిన దంపతులు తమ మొదటి బిడ్డను దానం చేస్తామని ప్రమాణం చేశారు. ఆ తర్వాత వారు ఆశ్రమానికి వచ్చి శ్రవణ్ పూరిని అప్పగించారు" అని చెప్పారు. అప్పటి నుంచి ఆ చిన్నారి ఇక్కడే పెరుగుతున్నాడని, సాధువులు, గురు సోదరులే అతని బాగోగులు చూసుకుంటున్నారన్నారు. ఇప్పుడు శ్రవణ్ పూరి ప్రవర్తన పూర్తిగా ఆధ్యాత్మికంగా మారింది. ఇంత చిన్న వయసులోనే సాధువుగా మారిన శ్రవణ్ పూరిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సాధువుల నియమావళిని పాటిస్తోన్న శ్రవణ్ పూరి

శ్రవణ్ పూరి ఇప్పుడు సాధువులు ఏయే నియమాలు పాటిస్తారో వాటిని పూర్తిగా అలవర్చుకున్నాడు. శ్రవణ్ పూరి నిద్రపోయే, మేల్కొనే సమయాలు కూడా సాధువుల మాదిరిగానే ఉంటాయి. ఇది చలికాలం కాబట్టి తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేపుతారు. కానీ వేసవి కాలంలో శ్రావణ్ పూరి నాలుగు గంటలకే నిద్రలేచేవాడు. అతని బాధ్యతను గత మూడేళ్లుగా తానే చూసుకుంటున్నానని మహంత్ కుందన్ పూరి తెలిపారు. అతన్ని ఓ ప్రైవేట్ స్కూళ్లో చేర్పించామని, ఆశ్రమంలో అనేక పాఠాలు చెబుతారని అష్టకౌశల్ మహంత్ సంత్ పూరీ మహరాజ్ తెలిపారు. సాధువులు ప్రార్థనలు, తపస్సు చేస్తున్నప్పుడు పిల్లవాడు వారితో పాటు వెళ్తాడని, శ్రవణ్ పూరి ఒక సాధువులా వ్యవహరిస్తాడని, అతని అసాధారణ ప్రతిభ తమను తరచుగా ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు. తన వయసులో ఉన్న ఇతర పిల్లల మాదిరిగా కాకుండా.. శ్రవణ్ చాక్లెట్లకు బదులు పండ్లు తినడానికే ఎక్కువ ఇష్టపడతాడని చెప్పారు. పూజ సమయంలో, అతను ఆలయంలో నిశ్శబ్దంగా కూర్చుంటాడని తెలిపారు.

Also Read : Hottest Year: భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - నాసా హెచ్చరిక