Worker Sets McDonalds Restaurant On Fire: కస్టమర్‌తో ఎక్కువ వస్తున్నారన్న కోపంతో మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగి స్టోర్‌ని తగలబెట్టేశాడు. గతేడాది ఏప్రిల్‌లో జార్జియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఎక్కువ పని చేయాల్సి వస్తోందన్న అసహనంతో ఈ పని చేశాడు. యూఎస్ అటార్నీ ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం స్టోర్ నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దారిన వచ్చిన వాళ్లంతా భయపడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పడానికి చాలా సమయం పట్టింది. స్టోర్‌ని తగలబెట్టిన తరవాత అదంతా వీడియో తీశాడు నిందితుడు. వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాదాపు ఏడాది కాలంగా ఈ విచారణ కొనసాగుతోంది. దీనిపై యూఎస్ అటార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటు ఆ స్టోర్ కొద్ది రోజుల పాటు మూసేయడానికి కారణమవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా తీవ్రమైన నేరమే అని తేల్చిచెప్పారు. వ్యక్తిగత కక్షతో చుట్టూ ఉన్న వాళ్లని ప్రమాదంలో నెట్టినందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలు చేసే వాళ్లను ఊరికే వదిలేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. 


ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికుల సాయం కూడా తీసుకున్నారు. స్టోర్‌ని తగలబెట్టిన సమయంలో లోపల చాలా మంది ఉన్నారు. మంటల్ని గుర్తించి వాళ్లు సరైన సమయానికి బయటకు రావడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. కార్డ్‌బోర్డ్‌ని విరగ్గొట్టి ఆ ముక్కకు మంట అంటించి స్టోర్‌లో పడేశాడు. మంటలు అంటుకునేంత వరకూ అక్కడే ఉన్నాడు నిందితుడు. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. తీవ్ర నేరంగా పరిగణించిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో అంత మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే..ఎంత మొత్తం కట్టాలన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. స్థానికంగా ఈ ఘటన అలజడి సృష్టించింది. 


Also Read: Viral News: తాజ్‌మహల్‌లో షాజహాన్ సమాధి వద్ద గంగాజలంతో అభిషేకం, ఇద్దరు అరెస్ట్ - వీడియో