Taj Mahal: తాజ్‌మహల్‌లో గంగాజలం పోసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ పని చేశామని ఆ ఇద్దరు పోలీసులకు చెప్పారు. అంతే కాదు. అది తాజ్ మహల్ కాదని తేజో మహాలయ్ అని వాదించారు. అందుకే గంగాజలాన్ని సమర్పించామని వెల్లడించారు. అది శివుని ఆలయమని పదేపదే వాదించారు. ఈ ఇద్దరు నిందితులు అఖిల భారత్ హిందూ మహాసభకు చెందిన వాళ్లుగా గుర్తించారు. తాజ్‌మహల్ బేస్‌మెంట్ వద్ద గంగాజలం పోస్తుండగా మరో వ్యక్తి ఇదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. సరిగ్గా షాజహాన్, ముంతాజ్ మహల్ ఉన్న చోటే గంగాజలాన్ని సమర్పించడం వివాదాస్పదమైంది. అక్కడే ఉన్న CISF సిబ్బంది వీళ్లని అరెస్ట్ చేసింది. టూరిస్ట్‌లుగా టికెట్‌లు కొనుక్కుని లోపలికి వచ్చారు. వాటర్ బాటిల్స్‌కి అనుమతి ఉండడం వల్ల గంగాజలాన్ని ఆ బాటిల్స్‌లో తీసుకెళ్లారు. సరిగ్గా బేస్‌మెంట్ వద్దే ఆ జలాన్ని పోశారు.
ఇప్పటికే తాజ్‌మహల్ పేరు మార్చాలంటూ పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. అది శివాలయమని వాదిస్తున్నారు. అక్కడ హారతి ఇచ్చేందుకు, పూజలు చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. తాజ్‌మహల్‌లో పూజలకు అనుమతి కోరుతూ కొందరు పిటిషన్‌లు వేశారు. శ్రావణ మాసం కావడం వల్ల శివుడికి పూజలు చేయాలని వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు నిందితులు తాజ్ గంజ్ పోలీసుల అదుపులో ఉన్నారు. అంతకు ముందు కూడా ఓ మహిళ ఇదే విధంగా గంగాజలాన్ని సమర్పించేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.