MCD Election Results 2022:


బీజేపీని ఢీకొట్టి..


"ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే...అక్కడ కాషాయ జెండా ఎగిరి తీరుతుంది". బీజేపీ శ్రేణులు తరచూ చెప్పే మాట ఇది. ఆ మాటకు తగ్గట్టుగానే... దాదాపు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుస్తూ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల విషయం పక్కన పెడితే...నార్త్‌లో మాత్రం దాదాపు పాతుకుపోయింది. ఉప ఎన్నికైనా, మున్సిపల్ ఎన్నికలైనా...చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయ వ్యూహాలు రెడీ చేసుకుంటుంది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విషయంలోనూ అదే వ్యూహం అనుసరించింది. కానీ...ఈ సారి మాత్రం ఫెయిల్ అయింది. ఇందుకు కారణాలేంటన్నది పక్కన పెడితే...ఓటమి ఓటమే. బీజేపీని నేరుగా తలపడి జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలతో రూట్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. నిజానికి...ఆప్ సాధించింది సాదాసీదా విజయం కాదు. బీజేపీ 15 ఏళ్లుగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా గెలవడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇలాంటి బీజేపీ కంచుకోటను కదిలించి గెలుపొందింది ఆప్. దాదాపు రెండు నెలలుగా లిక్కర్ స్కామ్‌తో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అది కాస్తా...జాతీయ అంశమైంది. ఢిల్లీ డిప్యుటీ సీఎం సిసోడియాపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఆప్ ఓ "అవినీతి పార్టీ" అని బీజేపీ బాగా ప్రచారం చేసింది. కానీ...ఎందుకో ఇవేవీ వర్కౌట్ కాలేదు. మంచి మెజార్టీతో ఆప్...అధికారాన్ని సొంతం చేసుకుంది. 


ఆత్మ విశ్వాసం పెరిగినట్టే!


ఇటీవలే పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్‌ఆద్మీ పార్టీ. అక్కడి కాంగ్రెస్‌పై విజయం సాధించింది. "కాంగ్రెస్‌ను ఓడించడం సులువేమో కానీ..బీజేపీని గెలవటం ఆప్ తరం కాదు" అని కాషాయ శ్రేణులు పదేపదే కామెంట్ చేసేవారు. ఇప్పుడీ విజయంతో కేజ్రీవాల్ గట్టి బదులే ఇచ్చినట్టైంది. అందుకే...మనీశ్ సిసోడియా "ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీని...మా చిన్న పార్టీ ఢీకొట్టి గెలిచింది" అని వ్యాఖ్యానించారు. పైగా...గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడే ఢిల్లీలోనూ ఈ ఎన్నికలు జరగటం, ఇక్కడ విజయం సాధించడం ఆప్‌నకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. రాబోయే ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని, ఆశను ఇంకా పెంచింది. "మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్"
వర్సెస్" నినాద ప్రభావం ఢిల్లీలో కనిపించలేదని, మిగతా రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ఆప్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. అంతే కాదు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటోంది. "మాకు గుజరాత్‌లో 15-20% ఓట్లు వచ్చినా అది మా విజయంగానే భావిస్తాం. బీజేపీ కంచుకోటలో ఆ మాత్రం ఓట్లు రాబట్టుకోగలిగాం అంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నట్టే కదా. ఎప్పటికైనా బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ మాత్రమే" అని బల్లగుద్ది చెబుతున్నారు కేజ్రీవాల్. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం...ఆప్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేసింది. గుజరాత్‌లో కేజ్రీవాల్ ప్రచారం చాలా అగ్రెసివ్‌గా సాగింది. 20కిపైగా ర్యాలీలు చేపట్టారాయన. గతంలో ఎప్పుడూ లేనంతగా..హిందుత్వ ఓటు బ్యాంకుకీ ఎర వేశారు. ఆ వర్గాన్ని ఆకట్టుకునే వ్యాఖ్యలూ చేశారు. కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అనే తన పొలిటికల్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఢిల్లీలో గెలవడం వల్ల ఆప్ మైలేజ్‌ ఇంకా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సరైన రీతిలో అభివృద్ధి జరిగితే "ఢిల్లీ మోడల్‌" అనే ప్రచారాస్త్రాన్ని ప్రయోగించేందుకూ వీలవుతుంది. అది సక్సెస్ అయ్యే అవకాశమూ ఉంటుంది. మొత్తంగా...ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈ విజయం బూస్ట్‌ లాంటిదే. 


Also Read: Delhi MCD Election Results: దిల్లీని మరోసారి ఊడ్చేసిన కేజ్రీవాల్- భాజపా 15 ఏళ్ల జైత్రయాత్రకు తెర