రేవ్‌ పార్టీ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. యువత రేవ్‌ పార్టీల పేరుతో విచ్చల విడిగా డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు పీకల వరకు మద్యం సేవిస్తూ.. మత్తులో చిత్తవుతున్నారు. సరదా కోసం మత్తుబాట పడితే  కర్సయిపోతర్రా బాబూ అని మొత్తుకున్నా.. తగ్గేదే లేదంటూ కొందరు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాటికి రేవ్‌పార్టీలే కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రెటీల పిల్లల నుంచి సామాన్య యువత సైతం ఈ రేవ్‌ పార్టీల్లో చిల్‌ అవుతూ.. జీవితాన్ని చిద్రం చేసుకుంటున్నారు. ఇంతకీ.. రేవ్‌ పార్టీ అంటే ఏమిటి..? ఈ కల్చర్‌ భారత్‌కు ఎలా విస్తరించింది.? ఇంతకీ ఈ పార్టీలో కేవలం డ్రగ్స్‌ మాత్రమే తీసుకుంటారా.. ఏం జరుగుతుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.


రేవ్‌ పార్టీ ఎలా ప్రారంభమైంది ?
60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీల పేరుతో మద్యం సేవించడం ప్రారంభమైంది. కానీ 80వ దశకం వచ్చే సరికి.. ఆ పార్టీల ట్రెండ్‌ మారడం ప్రారంభమైంది. అనంతరం ఇది రేవ్ పార్టీ రూపాన్ని సంతరించుకుంది. 90ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల కాన్‌సెప్ట్‌ ప్రారంభమైంది. లండన్‌లాంటి ధనికదేశాల్లో ఉద్వేగభరితమైన పార్టీలను రేవ్ పార్టీలు అని పిలవడం.. ఆ తర్వాత డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ రేవ్ పార్టీగా మారిపోయింది. మ్యూజిక్ టెక్నాలజీ, హాబీలు, డ్రగ్స్ దీనికి యాడ్ చేశారు. దీంతో వీటకి ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది.


భారత్‌లో రేవ్‌ పార్టీలు:
సాధారణంగా పార్టీల ట్రెండ్‌ భారత్‌లో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కానీ.. రేవ్‌ పార్టీలు అనేది గోవా నుంచి స్టార్ట్‌ అయిందనే చెప్పాలి. ఎందుకంటే.. గోవాలో చాలా అందమైన బీచ్‌లు ఉన్నాయి. దీంతో భారత్‌ నుంచే కాకుండా విదేశాల నుంచి భారీ మొత్తంలో టూరిస్ట్‌లు వస్తుండటంతో.. కొద్దికొద్దిగా ఫారెన్‌ కల్చర్‌తో పాటు రేవ్‌ పార్టీల కల్చర్‌ కూడా వచ్చింది. అయితే హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో నిత్యం రేవ్ పార్టీల అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.


రేవ్‌ పార్టీల్లో అసలు ఏం జరుగుతుంది.?
రేవ్‌ పార్టీలు ఎక్కువగా సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంటాయి. ఈ పార్టీల్లో పాల్గొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రేవ్‌పార్టీల్లో పెద్ద శబ్దంతో డీజేలు ప్లే చేస్తుంటారు. ఇక యువత సరదాగా ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఫుడ్‌, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్, ఎక్స్టసీ వంటి డ్రగ్స్‌ కూడా దొరుకుతాయి. కొన్ని రేవ్ పార్టీలలో సెక్స్ కోసం రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశం. ఈ పార్టీలలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుంటారు. రేవ్ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారు. అయితే ఈ పార్టీలకు ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. గోప్యతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఇక ఈ మధ్యకాలంలో ఆయా రాష్ట్రాల పోలీస్‌ అధికారులు.. రేవ్‌ పార్టీల విషయంలో కఠినమైన రూల్స్‌ పాటిస్తున్నప్పటికీ... గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు స్మగ్లర్లు. అయితే అధికారులు రూల్స్‌ను కఠినతరం చేయడంతో ఈ పార్టీలు కాస్త సిటీ ప్రాంతాలకు దూరంగా నిర్మానుషంగా ఉండే కొండలు, లేదా అటవీప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన భవనాల్లో నిర్వహిస్తున్నారు.