Mumabi Massive Fire Accident: ముంబయిలోని ఆదర్శ్‌ నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 10-15 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం వాటిల్లిందని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది. ముంబయి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మంటలు ఆర్పేయడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే...ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్నది మాత్రం ఇంకా కారణం తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





మంటలు భారీగా వ్యాపించడం వల్ల స్థానికులు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తరవాత అలజడి కాస్త తగ్గింది. ఈ ప్రమాదంలో 15 షాప్‌లు పూర్తిగా తగలబడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులూ బకెట్‌లలో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు బూడిదైపోయాయి. సిలిండర్‌లు,ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయింది. దాదాపు 20 బైక్‌లు కూడా పాక్షికంగా కాలిపోయాయి. 






మధ్యప్రదేశ్‌లో ఫిబ్రవరి 6వ తేదీన ఓ టపాకాయల దుకాణంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం జరిగిన టపాకాయల కర్మాగారం అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపు ఏడుగురు చనిపోయారని తెలిసింది. 63 మంది తీవ్రగాయాలపాలు అయ్యారు. గాయపడిన వారు అందరినీ హార్దా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ లోని హార్దా సిటీలో ఈ పేలుడు జరగ్గా.. చుట్టుపక్కల 50 ఇళ్ల వరకూ ఆ మంటలు అంటుకున్నాయని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సకు అయ్యే ఖర్చును ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. పేలుడు ఘటన గురించి సమాచారం అందగానే ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. హుటాహుటిన భోపాల్, ఇండోర్ సహా సమీప ప్రాంతాల నుంచి ఫైరింజన్లను తెప్పించారు. అంబులెన్స్ లను కూడా తెప్పించి.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.