Top Telugu News in Telugu States And National on 17th February:


1) తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్ పై శ్వేతపత్రం


తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై ప్రవేశపెట్టిన తీర్మానానికి శుక్రవారం ఆమోదం తెలపగా.. శనివారం సాగునీటి శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014 నుంచి 2023 వరకూ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు.


2) గులాబీ బాస్ కేసీఆర్ పుట్టినరోజు.. బీఆర్ఎస్ వేడుకలు


ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం 70వ ఏట అడుగిడనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. కార్యకర్తలు రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. కాగా, కేసీఆర్ బర్త్ డే రోజున ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఛైర్మన్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.


3) ఫ్రీ కరెంట్ పై తెలంగాణ ప్రభుత్వం అప్ డేట్


రాష్ట్రంలో ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 'గృహజ్యోతి' (GruhaJyothi) పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ధ్రువీకరణ (అథెంటిఫికేషన్) చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 


4) శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్వీ - ఎఫ్14 ప్రయోగం


వాతావరణ ఉపగ్రహం ఇన్ శాట్ - 3డీఎస్ ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్ ను శనివారం ఇస్రో ప్రయోగించనుంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:35 గంటలకు ఈ రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 02:05 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా 2,275 కిలోల బరువైన ఇన్ శాట్ - 3DS ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలను ఈ రాకెట్ పర్యవేక్షించనుంది.


5) రేపు రాప్తాడులో సీఎం జగన్ 'సిద్ధం' సభ


అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ ఆదివారం 'సిద్ధం' సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ఎన్నికల శంఖారావంలో భాగంగా రెెండోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే 7 ఇంఛార్జీల జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో 'వైనాట్ 175' అనే నినాదంతో దూసుకుపోతున్నారు. కాగా, ఇప్పటికే జరిగిన రెండు సభలు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. 


6) నెల్లూరు జిల్లాలో కోళ్లకు వైరస్


నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధిని ఏవియన్ ఇన్ ఫ్లుయంజాగా గుర్తించినట్లు ఏపీ పశు సంవర్థక శాఖ కీలక ప్రకటన చేసింది. భోపాల్ లో ల్యాబ్ టెస్ట్ కు పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీఎం ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, ఈ వ్యాధి నెల్లూరు జిల్లాలో తప్ప ఎక్కడా కనిపించలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.


7) కేజ్రీవాల్ విశ్వాస తీర్మానంపై నేడు చర్చ


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడడం ఇది రెండోసారి. ఆప్ కు 62 మంది ఎమ్మెల్యేలుండగా.. బీజేపీ బలం రెండుకు పడిపోయింది.


8) అయోధ్య రామయ్య దర్శనం.. గంట బ్రేక్


ఉత్తరప్రదేశ్ అయోధ్యలో కొలువుదీరిన రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ లల్లా ఆలయంలో బాలరాముడి దర్శనానికి ఇకపై ప్రతిరోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. రోజూ మధ్యాహ్నం 12:30 నుంచి 01:30 గంటల వరకూ ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని చెప్పారు.


9) మూడో టెస్టుకు దూరమైన స్టార్ స్పిన్నర్ అశ్విన్


రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా(Team India)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌... మ్యాచ్‌ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. 


10) మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో సన్మానం


మెగాస్టార్‌ చిరంజీవిని 'పద్మ విభూషణ్‌'తో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. 2024 రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్‌ పద్మ విభూషణ్‌ వరించింది. కానీ తాజాగా ప్రముఖ నిర్మాత, పీపుల్స్‌ మీడియాలో ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ అమెరికాలో చిరంజీవిని కలిసిన నేపథ్యంలో ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. చిరుకు 'పద్మ విభూషణ్‌' అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు అమెరికాలో సన్మానం జరిపించబోతున్నట్టు తెలిపారు.