Earthquake in Japan: జపాన్‌లో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. నిముషం వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపం వచ్చింది. మొదటి సారి రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదు కాగా రెండోసారి ఇది 7.1గా నమోదైంది. ఈ ధాటికి క్యుషు, షికోకు ద్వీపాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజకి, కొచ్చి, ఒయిటా, కగోషిమా సహా పలు ప్రాంతాల్లో సునామీ అడ్వైడరీ జారీ అయింది. ఇప్పటికే మియాజకిలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువ అలలు వస్తున్నాయి. తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తే ప్రమాదముందని అధికారులు అలెర్ట్ చేశారు.  Japan Meteorological Agency ఇప్పటికే ఓ కీలక ప్రకటన చేసింది. సునామీలు వచ్చే ప్రమాదముందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించింది. ఎవరూ సముద్రం వైపు వెళ్లొద్దని హెచ్చరించింది. మియాజకి వద్ద సునామీ సంకేతాలు కనిపిస్తున్నాయని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.