Waqf Bill in Lok Sabha: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుని (Waqf (Amendment) Bill, 2024) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇకపై వక్ఫ్ బోర్డుల అధీనంలో ఉండే ఆస్తులన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉండేలా ఈ బిల్లులో మార్పులు చేశారు. అయితే...ఈ బిల్లుపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నినదించారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాజ్యాంగంపైన దాడి చేయడమే అని తేల్చి చెప్పారు. ముస్లిమేతరులను కూడా వక్ఫ్ కౌన్సిల్‌లో సభ్యులుగా చేర్చడాన్నీ తప్పుబట్టారు. ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని మండి పడ్డారు. ముస్లింల తరవాత క్రిస్టియన్లు, జైనులు..ఇలా వరస పెట్టి మిగతా మతాల వాళ్ల హక్కుల్ని అణిచివేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాల్ని దేశ ప్రజలు సహించరని తేల్చిచెప్పారు. (Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌ అనర్హతా వేటుపై రాజ్యసభలో రగడ, ఇండీ కూటమి నేతలు వాకౌట్ - ఛైర్మన్ తీవ్ర అసహనం)






"మేమంతా హిందువులమే. కానీ మిగతా మతాల పట్ల మాకు విశ్వాసం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. కేవలం మహారాష్ట్ర, హరియాణాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇప్పటికే భారత దేశ ప్రజలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మీకు తగిన పాఠం చెప్పారు. ఫెడరల్ వ్యవస్థపైనే మీరు దాడి చేస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోండి"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ


అసదుద్దీన్ అసహనం..


ఈ బిల్లుపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15 లను ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని మండి పడ్డారు. ఇలాంటి చట్టాలతో దేశాన్ని విడగొడుతున్నారని ఆరోపించారు. ముస్లింలను బీజేపీ శత్రువులుగా చూస్తోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక వక్ఫ్ బోర్డ్ పరిధిలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రం ఓ ఆన్‌లైన్ పోర్టల్ తీసుకొస్తుంది. మరో ప్రతిపాదన ఏంటంటే...సెంటర్ వక్ఫ్ కౌన్సిల్‌తో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అందులో ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులూ సభ్యులుగా ఉంటారు. ఈ చట్టం అమలు బాధ్యత అంతా ఆయా జిల్లాల కలెక్టర్లపైనే ఉంటుంది. అది వక్ఫ్ ఆస్తులా లేదా ప్రభుత్వ భూములా అన్న విషయంలో కలెక్టర్లు మధ్యవర్తులుగా ఉండి ఆ సమస్యని పరిష్కరిస్తారు. 


Also Read: Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో