UP Mass Marriage Scheme:


సామూహిక వివాహ పథకం..


కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలకు యూపీ సర్కార్ శుభవార్త చెప్పింది. నూతన వధూవరులకు ప్రభుత్వమే ఉద్యోగావకాశాలు కల్పించనుంది. యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ అధికారిక ప్రకటన కూడా చేశారు.  ఓ కాలేజ్‌ ఫంక్షన్‌కు హాజరైన ఆయన...ఈ విషయం వెల్లడించారు. సామూహిక వివాహ పథకం (Mass Marriage Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన వధూవరులకు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుందనితెలిపారు. "ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకంలో భాగంగా పేదింటికి చెందిన జంటలకు ప్రభుత్వమే వివాహం చేస్తుంది. ఆ తరవాత ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వాళ్ల అర్హతల ఆధారంగా ఉపాధి కల్పిస్తాం" అని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ పూర్తి స్థాయి న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే యోగి సర్కార్ పని చేస్తోందని స్పష్టం చేశారు. బల్లిలా జిల్లాలోని ఓ పీజీ కాలేజీలో సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరయ్యారు... దయాశంకర్ సింగ్. ఆ సమయంలోనే ఈ ప్రకటనలు చేశారు. దాదాపు 506 జంటలకు వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు. దయాశంకర్ సింగ్‌తో పాటు ఎమ్మెల్యే కేట్కి సింగ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానుకలు అందజేశారు. యూపీ సర్కార్ గతంలోనే ఓ కీలక పథకం ప్రవేశ పెట్టింది. ముఖ్యమంత్రి సామాజిక్ వివాహ్‌ పథకంలో భాగంగా...అమ్మాయి పెళ్లికి ఆర్థిక సహకారం అందిస్తోంది. పేద కుటుంబాలకు చెందిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు వివాహం చేసుకున్నా...వారికీ ఆర్థిక సహకారం అందజేస్తోంది. 


హిందూ వివాహాలపై అజ్మల్ వ్యాఖ్యలు..


ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు, అసోం ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా ముస్లింల విధానాన్ని అనుసరించి యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలని అన్నారు. "ముస్లింలలో పురుషులు 20-22 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు. మహిళలు కూడా మేజర్ కాగానే 18 ఏళ్లకు వివాహం చేసుకుంటారు. హిందువులు మాత్రం పెళ్లికి ముందే ఇద్దరి ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లు పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. విలాసంగా గడుపుతారు. డబ్బు దాచుకుంటారు" అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్స్ అక్కడితో ఆగలేదు. "హిందువులు 40 ఏళ్లు దాటాక తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకుంటారు. ఆ వయసులో పిల్లల్ని కని ఎలా పెంచగలరు..?" అని అన్నారు. కాస్త అభ్యంతరకరంగానూ మాట్లాడారు. దీనిపై హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లవ్ జిహాద్ (Love Jihad)పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అజ్మల్. శ్రద్ధా హత్య కేసుపై మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ సీఎం హిమత శర్మ ఇది "లవ్ జీహాద్" అని మండి పడ్డారు.దీనిపై దుమారం రేగుతున్న క్రమంలోనే...అజ్మల్ స్పందించారు. లవ్ జీహాద్, హిందు వివాహాలపై చేసిన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. "నా వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతీసి ఉంటే, వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నాను. మైనార్టీలకు న్యాయం చేయాలన్నదే నా ఉద్దేశం. వారికీ విద్య, ఉద్యోగాలు కల్పించాలి" అని అన్నారు. 


Also Read: Delhi Acid Attack Case: ఆన్‌లైన్‌లో యాసిడ్‌ కొన్నా, దూరం పెట్టిందనే కోపంతోనే దాడి చేశా - పోలీసుల విచారణలో నిందితుడు