Manish Sisodia: 


కేసులన్నీ నిరాధారమైనవే: సిసోడియా 


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సృష్టించిన అలజడి కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశమంతా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం స్కామ్‌లో తెరాసలోని పెద్దలు కీలక పాత్ర పోషించారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అటు..సీబీఐ ఈ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అటు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపి వేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్‌ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


8 మందికి లుకౌట్ నోటీసులు..


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ మొత్తం 8 మందికి లుకౌట్ ( Lookout)నోటీసులు జారీ చేసింది. వీరందరూ ఈ కేసులో నిందితులేనని భావిస్తోంది. FIRలో మొత్తం 9 మంది పేర్లుండగా...8 మందికి ఈ నోటీసులిచ్చింది. వీళ్లంతా ప్రైవేట్ వ్యక్తులే. Pernod Ricard కంపెనీ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మనోజ్ రాయ్ పేరు కూడా FIRలో ఉన్నా..ఆయనకు నోటీసులు పంపలేదు. ఈ నోటీసులు రాకముందే...ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే సీబీఐ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇది ఢిల్లీలో రాజకీయ దుమారం రేపింది. భాజపా వర్సెస్ ఆప్‌ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే CBI మనీష్ సిసోడియాపై లుకౌట్ సర్క్యులర్ (LOC)జారీ చేసిందని చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు వీల్లేందని ఆంక్షలు విధించినట్టు తెలిపారు. లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనపైనే మనీష్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. "సోదాలతో మీరు అనుకున్నది సాధించలేకపోయారు. అందుకే ఇప్పుడు నాపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదేం జిమ్మిక్ మోదీజీ..? నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. చెప్పండి నన్నెక్కడికి రమ్మంటారో..?" అని ట్వీట్ చేశారు. అయితే..అట సీబీఐ మాత్రం తాము ఆ నోటీస్‌ ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం లేదని తెలిపింది. అందుకు తగ్గట్టుగానే...లుకౌట్ నోటీసులు ఇచ్చిన వారి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఇటీవల సీబీఐ మనీష్ సిసోడియా ఇంటితో పాటు 7 రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. లిక్కర్‌ పాలసీతో సంబంధం ఉన్న ఈ రాష్ట్రాల్లోనూ తనిఖీలు చేసింది. లిక్కర్ పాలసీని ఉల్లంఘించిన 15 మందిలో సిసోడియా పేరు మొదటగా ఉందని కేంద్రం చెబుతోంది. 


Also Read: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత- బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు