Delhi Excise Policy: 


మొత్తం 15 మంది కేసు నమోదు..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ఈ స్కామ్‌లో మనీష్ సిసోడియా హస్తం కూడా ఉందన్న కారణంగా కేసు నమోదు చేసినట్టు CBI వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై FIR నమోదైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఈ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న CBI..మొత్తం 15 మంది పేర్లు ఇందులో పొందుపరిచింది. అయితే అంతకు ముందు సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్టు వార్తలొచ్చాయి. దీనిపై సీబీఐ వివరణ ఇచ్చింది. ఈ వార్తల్ని ఖండించింది. ఆ తరవాతే...15 మందిపై కేసు నమోదు చేసింది. 






ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సృష్టించిన అలజడి కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశమంతా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం స్కామ్‌లో తెరాసలోని పెద్దలు కీలక పాత్ర పోషించారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అటు..సీబీఐ ఈ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అటు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీతప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్‌ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గుజరాత్‌లో కేజ్రీవాల్ 


ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆయన...కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "మనీష్ సిసోడియా విద్యారంగంలో చేసిన సేవలు చాలా గొప్పవి. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేనివి ఆయన చేయగలిగాడు. ఆయన భారతరత్నకు కూడా అర్హుడు. కానీ..కేంద్రం కుట్ర పన్నుతూ సీబీఐ అస్త్రం వినియోగిస్తోంది" అని అన్నారు. "మనీష్ సిసోడియా అరెస్ట్ అవుతారు. బహుశా నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో ఎవరికి తెలుసు..? ఇదంతా కేవలం గుజరాత్ ఎన్నికల కోసమే" అని విమర్శించారు కేజ్రీవాల్.  గుజరాత్ ప్రజలు భాజపాను 27 ఏళ్లుగా భరిస్తున్నారని, వాళ్ల అరాచక పాలనలో వాళ్లు మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్..ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని గెలిపిస్తే...మెరుగైన విద్య,వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుజరాతీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామనీ చెప్పారు. "ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో గుజరాత్‌లోనూ పట్టణాలు, గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ఉన్న ప్రభుత్వాసుపత్రులను బాగు చేయటమే కాకుండా..కొత్త ఆసుపత్రులనూ అందుబాటులోకి తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. 


Also Read: Ysrcp Inside Politics : 60 మంది ఎమ్మెల్యేలు - 12 మంది ఎంపీలు ! గెలవని గుర్రాల లెక్క తేలుస్తున్న హైకమాండ్ !


Also Read: Amitabh Bachchan Covid 19: మరోసారి కరోనా పాజిటివ్.. బిగ్ బీ ఏమన్నారంటే?