కరోనా మహమ్మారి జనాలను ఇంకా వేధిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు దశల్లో జనాలను నానా ఇబ్బందులు పెట్టిన ఈ చైనా వైరస్.. ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నది. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఇబ్బంది పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
“నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల నన్ను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని అమితాబ్ బచ్చన్ ట్విటర్ వేదికగా కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం పట్ల ఆయన అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆందోళనకు గురయ్యారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఆయన బాగు కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వీలైనంత త్వరగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకడం ఇది రెండోసారి. తొలిదశ కరోనా విజృంభించిన నేపథ్యంలోనే ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ఆ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అమితాబ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనువరాలు ఆరాధ్య బచ్చన్ కూడా కరోనా బారినపడ్డారు. వారంత చికిత్స తీసుకుని బాగయ్యారు. ప్రస్తుతం బిగ్ బీకి రెండోసారి కరోనా సోకింది.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బిగ్ బీ ఫేమస్ టీవీ షో.. కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ షూటింగ్లో కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. అటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో బిగ్ బీ నటించారు. ఈ సినిమా త్వరలో జనాల ముందుకు రాబోతుంది. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో సినిమాలకు, టీవీ షోలకు బ్రేక్ ఇచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటి చేరుకున్న తర్వాత ఆయన మళ్లీ షూటింగులకు వెళ్లే అవకాశం ఉంది. తాజాగా ‘కార్తికేయ-2’ సినిమా దర్శకుడు చందు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ఈ సినిమా బిగ్ బీకి చాలా నచ్చడంతో వెంటనే దర్శకుడు చందుకు ఫోన్ చేశారు. చక్కటి సినిమా తీయడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. దర్శకుడిని తన ఇంటికి ఆహ్వానించారు. బిగ్ బీ పిలుపుతో ఆయన ఇంటికి వెళ్లిన చందును.. ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారట. ఈ సందర్భంగా కార్తికేయ-2 సినిమా యూనిట్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను చందు తన ఇన్ స్టాలో షేర్ చేశారు. మున్ముందుకు అమితాబ్ తో సినిమా తీసే అవకాశం చందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.