Manipur Violence:
షాక్ అయిన అమెరికా..
మణిపూర్ వైరల్ వీడియోపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వీడియోని చూసి షాక్ అయినట్టు వెల్లడించింది. ఈ విషయంలో భారత్‌కి పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైట్‌హౌజ్ ప్రకటించింది. బైడెన్ యంత్రాంగంలోని ఓ అధికారి ఈ ఘటనపై కీలకవ్యాఖ్యలు చేశారు. స్త్రీలపై ఇంత దారుణంగా వివక్ష చూపిస్తూ దాడి చేయడం అమానుషం అని అన్నారు. వాళ్లకు న్యాయం జరిగేలా చూడడానికి తామూ సహకరిస్తామని తేల్చి చెప్పారు.
"మణిపూర్‌లో ఇద్దరి మహిళలపై దాడి జరిగిన తీరుని చూస్తే ఒళ్లు జలదరించింది. చాలా భయమేసింది. బాధితులకు మా అండ ఎప్పటికీ ఉంటుంది. ఇలా మహిళలనే లక్ష్యంగా చేసుకుని దారుణంగా దాడులు చేస్తున్నారు. వీటిని నియంత్రించడంలో భారత ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మణిపూర్‌లో హింస శాంతియుతంగా పరిష్కారమవ్వాలని కోరుకుంటున్నాం. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అన్ని తెగల వాళ్లకూ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది."
- వేదాంత్ పటేల్, స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి
రాష్ట్రపతి పాలన విధించాలా..?
ఓ పాకిస్థానీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు వేదాంత్ పటేల్. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఘటనపై స్పందించారని, నిందితులను ఉపేక్షించేది లేదని ప్రకటించారని పటేల్ గుర్తు చేశారు. అటు అమెరికాలో ఉన్న మణిపూర్ వాసులు కూడా తక్షణమే ఈ హింసాత్మక ఘటనలు ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అంతే కాదు. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. "ఇంత జరుగుతున్నా మనం ఎందుకింత సైలెంట్‌గా ఉన్నాం. ఈ హింసకు ఒక్కటే పరిష్కారం. రాష్ట్రపతి పాలన విధించడం. ప్రభుత్వం ఎందుకింతలా ఆలోచిస్తోందో అర్థం కావట్లేదు" అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మణిపూర్ హింసాంకాండ మొత్తం దేశాన్ని ఉడికిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ దీనిపై పెద్ద రగడే జరుగుతోంది. ఈ హింసపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయటే ఆందోళనలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన బైరెన్ సింగ్ మరోసారి ఇదే విషయం వెల్లడించారు. రిజైన్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే ప్రసక్తే లేదు. కానీ కేంద్రం ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయను. ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీలో ఉన్నాను. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించడం నా బాధ్యత. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక లక్ష్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావడం. వీలైనంత త్వరగా పరిస్థితులు అదుపులోకి రావాలి. రాజీనామా చేయమని ఇంత వరకూ మా పార్టీ నాకు చెప్పలేదు."