Manforce Voting Ad: ప్రజల్లో ఓటు చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నాయి. అటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లూ, సినీ ప్రముఖులూ ఓటు వేయాలని పిలుపునిస్తూ రకరకాల ప్రకటనల్లో కనిపిస్తున్నారు. అయితే...ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ యాడ్ తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తుంటే అసలు దీనికి, ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అనిపిస్తుంది. కానీ చివర్లోనే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్ట్‌కే నెటిజన్‌లు ఫిదా అయిపోయారు. తిట్టే వాళ్లు తిడుతున్నారు కానీ యాడ్ మాత్రం జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. అదే Manforce కంపెనీ వాళ్ల యాడ్. యాడ్ చూస్తున్నంత సేపూ మనకి వేరే విధంగా అర్థమవుతుంది. చివరి వరకూ చూస్తేనే అసలు సంగతేంటో అర్థం కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఓ సంభాషణతో మొదలయ్యే ఈ యాడ్ చివరికి ఓ అబ్బాయి, అమ్మాయి కలిసి పోలింగ్ బూత్‌కి వెళ్లడంతో ముగుస్తుంది. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటంటే...యూత్ కచ్చితంగా ఓటు వేయాలని చెప్పడం. ఓటు హక్కు ఉండి కూడా చాలా మంది బద్ధకించి పోలింగ్ బూత్ వరకూ వెళ్లరు. అలాంటి వాళ్లపై సెటైర్ వేస్తూ ఈ యాడ్‌ని షూట్ చేశారు. #VotingVirgin పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది మ్యాన్‌ఫోర్స్ కంపెనీ. ఇప్పటి వరకూ ఓటు వేయని వాళ్లని ఇలా ఓటింగ్ వర్జిన్‌లుగా ప్రచారం చేస్తోంది ఈ సంస్థ. "ఇంకెన్నాళ్లు ఇలా ఓటింగ్ వర్జిన్స్‌లా ఉంటారు. ఈ ఎన్నికల్లో అయినా ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం" అని కాస్త డిఫరెంట్‌గా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.