హోటల్‌లో రెండు రోజులు ఉండాలంటేనే హడలిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది నెలలు హోటల్‌లో తిష్ట వేశాడు. అనుభవించు రాజా అంటూ టైం పాస్ చేశాడు. డిలాక్స్ రూమ్ తీసుకుని మరీ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశాడు. అతడు సంపన్నుడని భావించిన హోటల్ యాజమాన్యం డబ్బులకు ఆశపడి ఆ కస్టమర్‌ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత బిల్లు చెల్లించమని అడిగితే.. ‘‘సూర్, తప్పకుండా, చెక్కా.. క్యాషా? ఆన్‌లైన్ పేమెంటా’’ అని దొరలా అడిగాడు. చివరికి దొంగలా బాత్రూమ్ కిటికీ నుంచి ఎస్కేప్ అయ్యాడు.


ఈ ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబయిలో చోటుచేసుకుంది. అందేరీకి చెందిన మురళి కామత్ అనే 43 ఏళ్ల వ్యక్తి 2020 నవంబరు 23న తన 12 ఏళ్ల కుమారితో కలిసి ఖార్గార్ ప్రాంతంలోని ఓ త్రీస్టార్ హోటల్‌లో రెండు రూమ్‌లు తీసుకున్నాడు. తాను ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నానని, తనకు రెండు గదులు కావాలని, ఒకటి తాను ఉండేదుకు.. మరొకటి మీటింగులు, వర్క్ కోసం కావాలని తెలిపాడు. ఒక నెల తర్వాత మొత్తం బిల్లు చెల్లిస్తానని హోటల్ సిబ్బందికి చెప్పాడు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్‌ను వాళ్లకు ఇచ్చాడు. 


నెలలు గడుస్తున్నా మురళి ఒక్క పైసా కూడా హోటల్‌కు చెల్లించలేదు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేశారు. జులై 17న డబ్బు చెల్లిస్తేనే హోటల్ నుంచి బయటకు వదిలిపెడతామని హెచ్చరించారు. దీంతో అతడు తన కొడుకును పట్టుకుని బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు దూకి పారిపోయాడు. అయితే, ఆ గదిలో తన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ వదిలేశాడు. చివరికి హోటల్ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఎనిమిది నెలలకు గాను మురళి రూ.25 లక్షలు చెల్లించాలని పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం మురళి పరారిలో ఉన్నాడు.  


Also Read: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..


కొద్ది నెలల కిందట తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన ఓ మహిళ విష్ణు రెసిడెన్సీ లాడ్జిలో గది తీసుకుంది. తనని తాను రిటైర్డ్ ఆర్టీవోగా పరిచయం చేసుకుంది. భూముల వ్యవహారంపై ప్రత్యేక అధికారిగా ఇక్కడికి వచ్చానని తెలిపింది. ఆధార్ కార్డు ఇవ్వమంటే తన తండ్రి సుప్రీం కోర్టు జడ్జి అని, భర్త రిటైర్డ్ డీజీపీ అని నమ్మబలికింది. దీంతో సిబ్బంది ఆమెకు హోటల్‌లో ఓ గదిని అద్దెకు ఇచ్చారు. చిత్రం ఏమిటంటే.. ఆమె ఆ హోటల్‌కు పైసా అద్దె కూడా చెల్లించలేదు. పైగా హోటల్ సిబ్బంది నుంచి రూ.80,400 అప్పుగా తీసుకుంది. సుమారు 3 నెలలు టైంపాస్ చేసింది. తన భర్త అమెరికాలో ఉన్నాడని, రాగానే రూమ్ ఖాళీ చేస్తానని చెప్పింది. చివరికి హోటల్ సిబ్బంది ఆమె గదిని తనిఖీ చేయగా ఆధార్ కార్డు లభించింది. దీంతో ఆమె గుట్టు రట్టయ్యింది. హోటల్ గది అద్దె రూ.1.80 లక్షలతోపాటు రూ.80,400 అప్పు తిరిగి చెల్లించాలని హోటల్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఆమె ఇవ్వలేనని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆమె చాలా చోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?