కొన్ని చేపలకు దంతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ, మనుషుల తరహా దంతాలు కలిగిన చేపలను ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు తప్పకుండా ఈ చేప గురించి తెలుసుకోవల్సిందే. అమెరికాలోని వర్జీనియాకు చెందిన జాలరి నాథన్ మార్టిన్ ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లాడు. ఈ సందర్భంగా అతడికి ఓ చేప చిక్కింది. దాని ముందు పళ్ల వరుస అచ్చం మనుషుల దంతాల తరహాలోనే ఉన్నాయి. దీంతో కాసేపు అతడికి మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే ఆ అరుదైన చేప చిత్రాలను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశాడు. అంతే.. ఆ చిత్రాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. 


ఈ చేప ముందు పళ్ల వరుసలోనే కాదు.. దాని నోరు మొత్తం పదుల సంఖ్యలో దంతాలు ఉన్నాయి. ఈ రకం చేపలు ఇతర చేపలను వేటాడి నమిలి తినేందుకు వీలుగా వాటి దంతాలు ఉంటాయని మెరిన్ సైన్స్ నిపుణులు తెలిపారు. ఈ చేపలను ‘షీప్స్ హెడ్ ఫిష్’ అని కూడా అంటారు. కొన్నాళ్ల కిందట అమెరికాలోని జార్జియాలో ఉన్న సెయింట్ సిమన్స్ ఐలాండ్‌ సముద్ర తీరంలో కూడా ఇలాంటి చేప ప్రత్యక్షమైంది. బీచ్‌లో నడుస్తున్న మలీహ్ అనే మహిళ షీప్స్ హెడ్ చేపను చూసి ఆశ్చర్యపోయింది. అప్పట్లో ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


ఈ చేపలు సుమారు 76 సెంటీమీటర్ల పొడవు ఉంటాయట. అమెరికా సముద్ర తీరంలోనే కాకుండా అట్లాంటిక్, గల్ఫ్ సముద్ర తీరాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయట. అయితే, ఇవి చాలా అరుదుగా కనిపించే చేపలు. గతంలో కూడా ఇలాంటి చేపలు జాలర్లకు చిక్కాయి. ఈ చేపలను మొదటిసారిగా గుర్తించిన న్యూయార్క్‌లోని ఓ తీర ప్రాంతానికి ‘షీప్స్‌హెడ్ బే’ అని పేరు పెట్టడం విశేషం. మరి, ఈ చేపలను తినొచ్చా? అనేగా మీ సందేహం? డోన్ట్ వర్రీ.. లొట్టలేసుకుని మరీ ఈ చేపలను తినియోచ్చు. అయితే, వీటిని శుభ్రం చేయడం మాత్రం చాలా కష్టమట. 


మరి, ఈ చేపలను తినొచ్చా? అనేగా మీ సందేహం? డోన్ట్ వర్రీ.. లొట్టలేసుకుని మరీ ఈ చేపలను తినియోచ్చు. అయితే, వీటిని శుభ్రం చేయడం మాత్రం చాలా కష్టమట. వీటిని తింటుంటే పీతలను తింటున్నట్లే ఉంటుందట. ఎందుకంటే.. ఇవి ఎక్కువగా పీతలనే తింటాయి. పైగా ఆ చేప దంతాలు వాటిని నమిలి తినేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఈ చేప చిత్రాలను చూసిన నెటిజనులు.. ‘‘అమ్మో.. ఇలాంటి చేప చిక్కితే.. అక్కడే పడేసి పరుగులు పెట్టేస్తా’’ అని అంటున్నారు.