Man Bites Snake: బిహార్‌లో ఓ వ్యక్తి తనను కరిచిన పాముని కొరికి అవతల పారేశాడు. నోట కరుచుకుని కసి తీరా కొరికి ప్రాణాలు తీశాడు. నవాదాలో జరిగిందీ ఘటన. సంతోష్ లోహార్ రైల్వేలో పని చేస్తున్నాడు. చాలా రోజుల తరవాత కాస్త విశ్రాంతి తీసుకుందాని బేస్‌ క్యాంప్‌లో నిద్రపోయాడు. ఆ సమయంలోనే పాము కాటు వేసింది. వెంటనే ఆ పాముని పట్టుకుని కసకసా కొరికేశాడు. రెండు సార్లు బలంగా కొరకడం వల్ల ఆ పాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాము కాటు వేసినప్పుడు విషం ఎక్కకూడదంటే దాన్ని కొరికి చంపాలని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది మూఢనమ్మకమని వైద్యులు కొట్టి పారేశారు. ఈ ఘటనలో పాము చనిపోగా బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మిగతా సిబ్బంది గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్‌ వల్ల చాలా వేగంగా కోలుకున్నాడు. ఆ మరుసటి రోజే ఇంటికి వెళ్లిపోయాడు. 


అంతకు ముందు యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫతేపూర్‌కి చెందిన ఓ వ్యక్తి రెండు నెలల వ్యవధిలోనే ఐదు సార్లు పాము కాటుకు గురయ్యాడు. డాక్టర్లే షాక్ అయిన సంఘటన ఇది. అన్ని సార్లు కాటు వేసినా ప్రతిసారీ బతికి బట్టకట్టడం మెడికల్ మిరాకిల్ అని వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అప్పట్లో బాగా వైరల్ అయింది. 


పాము కాటుపై WHO మార్గదర్శకాలు..


పాము కాటు వేసినప్పుడు ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వీలైనంత త్వరగా హాస్పిటల్‌కి తరలించాలని WHO తేల్చిచెప్పింది. అత్యవసర వైద్యం ద్వారా ప్రాణాలు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. ఎప్పుడైనా పాము కాటు వేస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని, బిగుతుగా ఉండే దుస్తులు విప్పేయాలని WHO సూచించింది. కాటు వేసిన చోట నోరు పెట్టి విషాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయకూడనది స్పష్టం చేసింది. దానికి బదులు మెరుగైన చికిత్స అందించే హాస్పిటల్‌కి తరలించాలని సూచించింది. వైద్యం అందేలోగా ప్రాథమిక చికిత్స అందించాలి. ఆ సమయంలో ఐస్‌ పెట్టడం లేదా కాపడం లాంటివి చేయకూడదు. ఏమీ తినొద్దు తాగొద్దు. కాటు వేసి పాము అలాగే అతుక్కుపోతే దాన్ని చేతితో కాకుండా కర్ర లేదా ఇంకేదైనా పరికరంతో దాన్ని తొలగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.