Mallikarjun Kharge Chair Person:
I.N.D.I.A కూటమిని ముందుకు నడిపించేదెవరన్న అంశంపై ఇన్నాళ్ల సస్పెన్స్‌కి తెర పడింది. ఈ కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బాధ్యతలు తీసుకున్నారు. కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపాదించినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదు. నిజానికి ఈ కూటమి ఛైర్‌పర్సన్‌గా నితీష్ కుమార్ (Nitish Kumar) ఉండాలని చాలా మంది ప్రతిపాదించారు. కానీ...ఆ పదవి కాంగ్రెస్‌కి చెందిన కీలక నేతకే దక్కాలన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. చివరికి ఆయన పేరునే ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కన్వీనర్ పదవి కూడా కాంగ్రెస్ నేతకే అప్పగించాలని నితీష్ కుమార్ తేల్చి చెప్పినట్టు JDU నేతలు చెబుతున్నారు. తనకు ఆ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పినట్టు తెలుస్తోంది.
విపక్ష కూటమి నేతలు వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఎన్నో కీలక అంశాలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగాయి. ఇదే సమయంలో కూటమి కన్వీనర్ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చాలా సేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే ప్రస్తుతానికి ఖర్గేని ఛైర్‌పర్సన్‌గా అంగీకరించినట్టు సమాచారం. అయితే...అధికారికంగా మాత్రం కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపిన తరవాత అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిపైనా కీలక ప్రతిపాదనలు చేశారు. మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని సూచించారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు పలికారు. ఈ విషయంలో కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రతిపాదనపై నితీష్ కుమార్ అలిగినట్టు తెలుస్తోంది. ఆ తరవాత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. అది కేవలం ప్రపోజల్ మాత్రమే అని బుజ్జగించారు. ఈ విషయంలోనే కాదు. సీట్‌ల పంపకాల్లోనూ విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకోవడం వల్ల సీట్ షేరింగ్ కత్తిమీద సాముగా మారింది. మల్లికార్జున్ ఖర్గే కాస్త చొరవ తీసుకుని విభేదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవేవీ పెద్దగా సక్సెస్ అవడం లేదు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో సీట్‌ల పంపకాల పంచాయితీ నడుస్తోంది. అటు మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇలానే ఉంది. యూపీలోనూ ఇంకా ఏ విషయమూ కొలిక్కి రాలేదు.
Also Read: Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవం కోసం రైళ్ల షెడ్యూల్ మార్చేసిన రైల్వే, పూర్తి వివరాలివే