BRS MLA Marri Rajashekar Reddy : మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే సొంత పార్టీ నేత ఫోన్ నెంబర్ నుంచే బెదిరింపు కాల్స్ రావడంతో స్థానిక నేతలు ఆశ్చర్యపోతున్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్ తో కాల్స్ వస్తుండటంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే టెక్నాలజీ ఉపయోగించి ఎమ్మెల్యే పేరుతో తమకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బాధితులు మల్కాజిగిరి, నేరెడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 


రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వచ్చిన వారిలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నేరెడ్మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తమ ఫిర్యాదులలో గులాబీ పార్టీ నేతలు పేర్కొన్నారు. 


ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. దాంతో ఆయన  అనుచరులే ఈ బెదిరింపు కాల్స్ చేసి తమ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నేరెడ్మెట్ పోలీస్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


రాచకొండ సీపీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు
మల్కాజిగిరి బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.