Mahmood Madani Apology


ఇస్లాం మతం ప్రాచీనమైంది: మదాని 


జమియత్ ఉలెమా ఇ హింద్ అధ్యక్షుడు మహమూద్ మదాని ఇటీవల ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా దీనిపై అలజడి రేగింది. "ఇస్లాం మతం భారత్‌లోనే పుట్టింది" అని ఆయన చేసిన కామెంట్స్‌ను ఖండిస్తూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు. భారత్‌లో అత్యంత ప్రాచీనమైన మతం "ఇస్లాం" అని అన్నారు మహమూద్. తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న క్రమంలో క్షమాపణలు చెప్పారు  మహమూద్ మదాని. ABP Newsతో మాట్లాడిన ఆయన...ఈ వ్యాఖ్యలపై ఇంత పెద్ద దుమారం రేగుతుందని అనుకోలేదని చెప్పారు. 


"ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఇది నేను ఊహించలేదు. ఇస్లాం అనేది అత్యంత ప్రాచీనమైన మతం అని నేను విశ్వసిస్తున్నాను. అందులో ఏం తప్పుందో అర్థం కావట్లేదు. నాకు మాట్లాడే హక్కు ఉంది. ఎందుకు దీన్ని ఖండిస్తున్నారో తెలియడం లేదు. ఎంతో రీసెర్చ్ చేసిన తరవాతే ఇలా మాట్లాడాను. ఇందులో నిజం ఉంది. ఇదేం కొత్త విషయం కాదు. " 


-మహమూద్ మదాని 


జమియత్ ఉలెమా ఇ హింద్ కార్యక్రమంలో మహమూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యోగా గురు లోకేష్ ముని వెంటనే వేదికపై నుంచి వెళ్లిపోయారు. దీనిపైనా స్పందించిన మహమూద్..వేదికపై భిన్న మతాలకు చెందిన వారున్నారని, ఇలా జరుగుతుందని ఊహించామని అన్నారు. ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. 


"సర్వ్ ధర్మ సన్సద్‌పై నాకెంతో గౌరవం ఉంది. చాలా రోజులుగా ఆ సంస్థతో కలిసి పని చేస్తున్నాను. నేను కావాలని ఎవరినీ బాధ పెట్టలేదు. ఒకవేళ  బాధ పడి ఉంటే క్షమించండి. 100 సార్లు సారీ చెబుతున్నాను" 


-మహమూద్ మదాని 


అంతకు ముందు ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు మహమూద్. "భారతదేశం అందరిదీ. ప్రధాని మోదీ, ఆర్ఎస్‌ఎస్‌ మోహన్ భగవత్‌కు ఎంత హక్కుందో..మహమూద్ మదానికి కూడా అంతే హక్కుంది" అని అన్నారు. 


ఆర్ఎస్‌ఎస్‌ నేత దత్తాత్రేయ హోసబేల్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డుమాంసం తినే వాళ్లు కూడా మళ్లీ హిందూ మతంలోకి రావచ్చని వెల్లడించారు. అంతే కాదు. భారత్‌లో నివసించే వాళ్లందరూ పుట్టుకతోనే "హిందువులు" అని తేల్చి చెప్పారు. గొడ్డు మాంసం తినే వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, కానీ...అలాంటి వాళ్లు హిందూ మతంలోకి వస్తామంటే మాత్రం ఆహ్వానం పలకాలని వెల్లడించారు. అలాంటి వాళ్లనూ  హిందూ మతంలోకి సాదరంగా స్వాగతించాలని అన్నారు. 


"ఎవరు ఏ వర్గానికి చెందిన వారైనా సరే. వాళ్ల పూర్వీకులు హిందువులే. అందుకే వీళ్లు కూడా హిందువులే అవుతారు. వాళ్లు ఏ దేవుడిని పూజిస్తున్నారు..? ఏ ఆచారాలు పాటిస్తున్నారు..? అనేది మాకు అనవసరం. హిందువులు ఎప్పటికీ హిందువులే" 


- దత్తాత్రేయ హోసబేల్, ఆర్‌ఎస్‌ఎస్‌ లీడర్ 


దేశవ్యాప్తంగా 600కి పైగా గిరిజన తెగలున్నాయన్న దత్తాత్రేయ...వాళ్లు కూడా హిందువులే అని తేల్చి చెప్పారు. 


"గిరిజన తెగలు మేము హిందువులం కాదు అని పదేపదే చెబుతుంటాయి. జాతి వ్యతిరేక శక్తులే వాళ్లను ఇలా మభ్య పెడుతున్నాయి. వసుధైక కుటుంబం అనే సూత్రం మనది. ఎవరైనా హిందూ మతంలోకి మారాలనుకుంటే తలుపులు మూసేసి నియంత్రించడం సరికాదు. గొడ్డు మాంసం తినే వాళ్లనైనా సరే రానివ్వాలి. భారత్ ఎప్పటికీ హిందూ దేశమే. ఈ దేశాన్ని నిర్మించింది హిందువులే. ఈ నిజాన్ని అందరూ అంగీకరించాలి" 


- దత్తాత్రేయ హోసబేల్, ఆర్‌ఎస్‌ఎస్‌ లీడర్ 


Also Read: Balloon Row: ఒకదాని తర్వాత మరొకటి, ఎగిరే వస్తువును కూల్చేసిన అమెరికా