కొంతమందికి సహజంగా పిల్లలు కలిగే అవకాశం ఉండదు, ఇలాంటి వారు ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకుంటారు. ఇక సాధారణంగా పిల్లల్ని కనే అవకాశం ఉన్నవారు కూడా ప్లానింగ్ చేసుకుంటారు. వీరంతా తల్లిదండ్రులు కావడానికి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఐవీఎఫ్ పద్ధతిలో చికిత్స పొందుతున్నప్పుడు మాత్రం కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా నివారించాలి. శాఖాహారం, గ్లూటెన్ లేని ఆహారాన్ని తినడం చాలా మంచిది. బిడ్డకు ప్లాన్ చేస్తున్నవారు ఎవరైనా కూడా గర్భం ధరించే వరకు కచ్చితంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే ఈ ఆహారాలు మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వీర్యకణాల చలనశీలతను తగ్గిస్తాయి. దీనివల్ల అవి అండాన్ని చేరే వేగం తగ్గిపోతుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో కొన్నింటిని పక్కన పెట్టడం ద్వారా గర్భధారణను త్వరగా పొందవచ్చు.
ప్రాసెస్ చేసిన ఫుడ్
వీటిలో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన రసాయనాలే. కాబట్టి వీటిని తినకూడదు. సాస్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు పూర్తిగా మానేయాలి. వీటిలో హార్మోన్ అవశేషాలు మిగిలి ఉంటాయి. ఇవి గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తాయి. అదే ఐవిఎఫ్‌లో అయితే ఆ చికిత్సకు ఆటంకం కలిగిస్తాయి.
పచ్చి గుడ్లు
పచ్చి గుడ్లు తాగడం లేదా వాటిని ఉపయోగించి తయారు చేసే మయోనైస్, బిస్కెట్లలోని క్రీం వంటివి పూర్తిగా తినడం మానేయాలి. సాల్మొనెల్ల వైరస్ అనేది పచ్చి గుడ్లలో అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. కాబట్టి దూరంగా ఉండాలి. ఉడికించిన గుడ్లు తినవచ్చు.
ఆల్కహాల్, కెఫీన్
కాఫీలు అధికంగా తాగే అలవాటు ఉన్నవారు దాన్ని మానేయాలి. ఆల్కహాల్ పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ రెండూ కూడా పిండం పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. జింక్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా ఆల్కహాల్ తాగడం వల్ల మూత్రంతో పాటూ బయటకు పోతాయి. దీంతో ఆ రెండింటి లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల గర్భం ధరించడం కష్టం అవ్వచ్చు. కాబట్టి రెండింటిని మానేయాలి. ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి.
సీ ఫుడ్
చేపలు, రొయ్యలు అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే సముద్రపు చేపలను, రొయ్యలను పూర్తిగా మానేయమని చెప్తున్నారు వైద్యులు. ఇవి ప్రోటీన్, కొన్ని కొవ్వు ఆమ్లాలకు మంచి మూలాలు. అయినప్పటికీ వాటిని తినడం వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రాల్లో పెరిగిన చేపల్లో పాదరసం కనిపిస్తోంది. ఇది దీనివల్ల పిండం అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అంతేకాదు పుట్టే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సముద్రపు ఆహారాలను పక్కన పెట్టాలి.
సోయా
సోయాతో చేసిన ఆహారాలు పురుషులపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా వారిలో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి వారు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. తక్కువ స్మెర్మ్ కౌంటు ఉన్న పురుషులు సోయాకు దూరంగా ఉండాలి. లేకుంటే వీర్యకణాల ఉత్పత్తి మరింత తగ్గిపోతుంది.
Also read: సువాసనలు వీచే కొవ్వొత్తులు ఇంట్లో వెలిగిస్తే ఒత్తిడి ఇట్టే మాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.