Italy News: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ముందు అక్కడ ఖలిస్థానీ మద్దతుదారులు అలజడి సృష్టించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహం కింద ఖలిస్థాన్‌కి మద్దతుగా నినాదాలు రాశారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ పేరు రాశారు. గుర్తించిన వెంటనే స్థానిక అధికారులు ఆ రాతల్ని తొలగించారు. G7 సమ్మిట్‌కి మోదీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడం సంచలనమవుతోంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని తేల్చి చెప్పింది. అధికారులతో ఇప్పటికే ఈ విషయమై మాట్లాడినట్టు తెలిపారు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ క్వాత్రా. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే ఖలిస్థాన్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 


"ఈ ఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విచారణ ప్రక్రియ మొదలైంది. గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకోవడాన్ని ఏ మాత్రం ఉపేక్షించం. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నాం"


- వినయ్ క్వాత్రా, భారత విదేశాంగ శాఖ సెక్రటరీ






జూన్ 13-15 మధ్య కాలంలో ప్రధాని మోదీ ఇటలీలో G7 సదస్సుకి హాజరు కానున్నారు. G7లో భారత్ సభ్య దేశం కాకపోయినప్పటికీ మర్యాద పూర్వకంగా ఆహ్వానం అందింది. 2019 నుంచి ప్రతి సదస్సుకీ భారత్‌ని ఆహ్వానిస్తున్నారు. 


Also Read: Rahul Gandhi: ఆయనలా దైవాంశ సంభూతుడిని కాను, నేనో మామూలు మనిషిని - మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు