Rahul Gandhi Dig at PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. అయితే...ఎక్కడ ఆయన ఎంపీగా ఉంటారన్న సందిగ్ధత మాత్రం ఇంకా కొనసాగుతోంది. దీనిపై రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీపై సెటైర్లు వేశారు. ఆయనలా తాను దైవాంశ సంభూతుడిని కానని, ప్రజల మాటే వింటానని చురకలు అంటించారు. దేవుడి చెప్పినట్టు కాకుండా ప్రజలు చెప్పిందే విని అర్థం చేసుకుంటానని వెల్లడించారు. చాలా రోజులుగా తానూ ఈ సందిగ్ధంలో ఉన్నానని చెప్పారు రాహుల్ గాంధీ. రాజ్యాంగం అనుమతినిస్తే రెండు చోట్లా ఎంపీగా ఉండాలని ఆశపడుతున్నట్టు అంతకు ముందు అన్నారు. కేరళలోని మలప్పురంలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


"వయనాడ్‌ ఎంపీగా ఉండాలా, రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలా అన్నది నాకు తెలియడం లేదు. ఓ సందిగ్ధంలో ఉండిపోయాను. దురదృష్టవశాత్తూ నన్ను ఏ దేవుడూ నడిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే పరమాత్మ చెప్పినట్టు వింటారు. ఆయన దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటారు. కానీ నేనో సాధారణ మనిషిని"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






దేశంలోని బడా ఎయిర్‌పోర్ట్‌లన్నింటినీ అదానీకి అప్పగించాలని బహుశా దేవుడే మోదీని ఆదేశించి ఉంటాడని సెటైర్లు వేశారు. కానీ తనకు ఈ సదుపాయం లేదని వెల్లడించారు. పేద ప్రజలే తనకు దైవంతో సమానమని స్పష్టం చేశారు. 


"నరేంద్ర మోదీని ఆ పరమాత్ముడే అదానీ అంబానీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించాడేమో. కానీ నాకు ఈ సదుపాయం లేదు. నేనో సాధారణ వ్యక్తిని. భారత్‌లోని పేద ప్రజలే నాకు దైవంతో సమానం. వాళ్లతో మనస్పూర్తిగా మాట్లాడతాను. అప్పుడు దేవుడే నేను ఏం చేయాలో నిర్దేశిస్తాడు" 


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
 


మోదీజీ ఆలోచన మార్చుకోండి: రాహుల్ 


అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బయాలజికల్‌గా పుట్టిన వాడిని కాదని, ఆ దేవుడే ఇలా పంపాడని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చాలా మంది విమర్శలు చేశారు. సెటైర్లు వేశారు. ఇదే వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. 400 లక్ష్యం నీరు గారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఇకపై తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, ప్రజలు ఓట్ల రూపంలో ఆ సంకేతం ఇచ్చారని తేల్చి చెప్పారు. 


Also Read: Mohan Charan Majhi Oath Ceremony: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం - తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు