రాజీనామా లేఖ సిద్ధం చేస్తాను: ఉద్దవ్ థాక్రే 


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయఅనిశ్చితి నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు అదృశ్యమై మళ్లీ మహారాష్ట్రకు తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను వెంటనే సిద్ధం చేస్తానని, గవర్నర్‌కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. శివసేనను మోసం చేయను అంటూనే కొందరు కావాలనే ఈ అనిశ్చితిని సృష్టించారని అసహనం వ్యక్తం చేశారు. సీఎం పదవి చేపట్టాలని తనపై శరద్ పవార్ ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. సీఎం పదవి తనకు ఊహించకుండానే వచ్చిందని స్పష్టం చేశారు. 


హిందుత్వ ఎజెండాకు శివసేన కట్టుబడి ఉందని, తమ వైపు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు థాక్రే. "ప్రజలకు చేరువలో లేనని, ఎవరితోనూ మాట్లాడలేదని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. దేశంలో టాప్‌ 5 ముఖ్యమంత్రుల్లో మహారాష్ట్ర సీఎం పేరు ఉందని గుర్తించాలి" అని అన్నారు. కమల్‌నాథ్, శరద్‌ పవార్‌ తనతో సంప్రదింపులు జరిపారని, వెంటే ఉంటామని మాట ఇచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ తనకు ఎంతో నిరాశ కలిగించాయని, సొంత పార్టీ నేతలే ఇలా చేయటం షాక్ కలిగించిందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని శరద్ పవార్‌ తనను కోరినట్టు తెలిపారు ఉద్దవ్ థాక్రే.