Konaseema News : కోనసీమ జిల్లా పేరుకు మద్దతుగా చేపట్టిన నిరసనలో చెలరేగిన అల్లర్లలో కారణమైన నిందుతులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సంఘటన జరిగిన నాటినుంచి సీసీ కెమెరాలు, మీడియా విజువల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డ ప్రత్యేక బృందాలు తాజాగా మరో 20 మందిని గుర్తించి వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 199 కు చేరుకుంది.
అల్లర్ల కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కొత్త ఎస్పీ సుధీర్ !
నూతన ఎస్పీగా కర్నూల్ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమిచింది. ఇంకా అయన బాద్యతలు స్వీకరించలేకపోయినా ఆయన పర్యవేక్షణలోనే ప్రస్తుత విచారణ వేగవంతంగా జరుగుతోంది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డితోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, క్రైం బ్రాంచ్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్ నెట్వర్క్, కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, లోకేషన్ ట్రేసింగ్ తదితర సాంకేతికత ఆధారంగా విచారణ చేస్తున్నారు. ముందు ఆరోజు అల్లర్ల సమయంలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీలు, పలు వీడియోలు, ఫోటోలు ఆధారంగా అనుమానితులను ట్రేస్అవుట్ చేసి వారిని అదుపులోకి తీసుకుని ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానంలో నిర్ధారించి ఆపై కేసులు నమోదు చేస్తున్నారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల అరెస్ట్
మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ల ఇళ్లు దహనం, పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరడం, రెండు ఆర్టీసీ, ఒక ప్రయివేటు కాలేజ్ బస్సుల దహనం విషయంలో పలువురు అనుమానితులను గుర్తించిన ప్రత్యేక బృందాలు అసలు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారన్న విషయంపైనా దృష్టిసారించి ఆపై కూడా పలువురు అనుమానితులను గుర్తించారు. వీరిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా అల్లర్లను ప్రేరేపించినట్లు గుర్తించారు పోలీసులు.
మరో 150 మంది నిందితుల కోసం గాలింపు
అల్లర్లలో నిందితులుగా ఉన్న వారిలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, కండ్లా, అండమాన్ తదితర ప్రాంతాలకు వెళ్లినట్లుగా వివిధ మార్గాల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సుమారు 150 మంది వరకు ఇలా తప్పించుకు తిరుగుతున్నవారున్నారని వీరందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.