పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించిన శిందే ప్రభుత్వం


Maharashtra Fuel Prices: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే కీలక ప్రకటన చేశారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతమున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం మేరకు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 వ్యాట్ తగ్గనుంది. ఈ వ్యాట్ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల అదనపు భారం పడనుంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, భాజపా-శివసేన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం తరవాత మీడియా సమావేశంలో ఏక్‌నాథ్ శిందే  ఈ ప్రకటన చేశారు. వ్యాట్ తగ్గించక ముందుముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 కాగా లీటర్ డీజిల్ ధర రూ.97.28గా ఉంది. వ్యాట్ తగ్గించాక లీటర్ పెట్రోల్ ధర రూ.106.36, డీజిల్ ధర రూ.94.28గా ఉండనుంది. ఇదే సమావేశంలో మరో ప్రకటన కూడా చేశారు శిందే. గత వారం హార్ట్ అటాక్‌తో శివసేన పార్టీ కార్యకర్త మృతి చెందాడు. ఆయన కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. జులై 6వ తేదీన భగవాన్ కాలే ముంబయిలోని మాతోశ్రీ కార్యాలయానికి వెళ్లాడు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు మద్దతు పలికేందుకు వెళ్లిన భగవాన్‌కి ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. సీఎం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాండురంగ్ బరోరా...మృతుని కుటుంబాని రూ.లక్ష చెక్ అందించారు.





 


త్వరలోనే కేబినెట్ విస్తరణ..? 


ఇక మంత్రివర్గ విస్తరణనూ త్వరలోనే చేపట్టనున్నారు శిందే. రెండు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌ జరగక ముందు ఓ విడత విస్తరణ చేసి, ఎన్నికలు పూర్తయ్యాక మరో ఫేజ్‌ చేపట్టాలని యోచిస్తోంది శిందే ప్రభుత్వం. జూన్ 30 వ తేదీన సీఎంగా ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లతో పాటు గవర్నర్‌ తప్ప మరెవరూ బాధ్యతలు చేపట్టలేదు. ట్రస్ట్ ఓట్ ప్రక్రియలో గెలుపొందాక, కేబినెట్ విస్తరణ చేస్తారని భావించారు. కానీ ఇందుకు కాస్త సమయం కావాలని సీఎం శిందే అన్నారు. నేతలందరి ప్రొఫైల్స్ మరోసారి చూశాక, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం...28 మంది భాజపా నేతలకు మంత్రిత్వ శాఖలు అప్పగించేందుకు సీఎం శిందే అంగీకరించినట్టు తెలుస్తోంది.